అక్రమ కలప లోడు ట్రాక్టర్ సీజ్
తాడేపల్లిగూడెం రూరల్: ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను మండలంలోని అప్పారావుపేట జంక్షన్ వద్ద ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కలపను కోరుమామిడి నుంచి పట్టెంపాలెంకు తరలిస్తున్నట్లు తెలిసింది. నీలాద్రిపురం గ్రామానికి చెందిన రైతు తోటలో మరో తొమ్మిది దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఫారెస్ట్ అధికారిని ఆదివారం వివరణ కోరగా, మొత్తం 20 దుంగల విలువ రూ.లక్ష ఉంటుందని అంచన వేస్తున్నట్లు తెలిపారు. కలప పట్టెంపాలెంకు చెందిన కంకిపాటి గన్నియ్యకు చెందినదిగా గుర్తించామన్నారు. కలపను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏలూరు టౌన్: ఒక వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నెహ్రూ కాలనీ 9వ రోడ్డుకు చెందిన ముని దుర్గాప్రసాద్ (49)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
అత్తిలి: అత్తిలి మండలం పాలూరు గ్రామానికి చెందిన శరకడం అప్పల సత్య సూర్యనారాయణ( 65) ఆరవల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు వివరాల ప్రకారం సూర్యనారాయణ లక్ష్మీనారాయణపురంలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా ఆరవల్లి వైఎస్సార్ కాలనీ సమీపంలో ఆటో ఢీకొంది. దీంతో అతని తలకు గాయమైంది. ప్రమాదం వివరాలు తెలుసుకున్న కుమారుడు అతన్ని తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


