
న్యాయం చేయండి మహాప్రభో
ఉండి: భూ అక్రమార్కులకు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతోంది. చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని, తమ ఆస్తిని అక్రమార్కులకు కట్టబెట్టేలా అక్రమ రిజిస్ట్రేషన్ చేసేందుకు రంగం సిద్ధమైపోయిందని తెలిపారు. అక్రమ డాక్యుమెంట్ తయారు కావడంతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా అక్రమార్కులు చెల్లించేశారని చెప్పారు. ఈ క్రమంలో వారం రోజులుగా ఆయన కార్యాలయం వద్ద కారులోనే నివాసం ఉంటూ కాలువలోనే స్నానం చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులైనా ఆయన తన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అఽధికారులు, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్రమార్కులు వస్తారనే సమాచారం ఉండటంతో కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తక్షణమే ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి ఉండి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేయకపోతే తాను తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమ లేదా మంగళవారం నుంచి నిరసన దీక్ష చేపట్టాలనుకుంటున్నానని తెలిపారు.
ఉండి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రంగబాబు నిరసన
తన ఆస్తి ఆక్రమ రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారని ఆరోపణ