
అధికారులూ.. వరదలపై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద తగ్గే వరకూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూ రు, వేలేరుపాడు మండలాల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరదల కారణంగా ఒక్కరికీ ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. నిండు గర్భిణులను సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, తాగునీరు, వంట సామగ్రి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు, కాజ్‌వేలు, రహదారులను ముందస్తుగా మూసివేయాలన్నారు. వరదల కారణంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.