
ఆదుకోవాలంటూ రోడ్డు ప్రమాద బాధితుల ధర్నా
ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులతో పాటు గ్రామస్తులు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మండలంలోని నెక్కలం గొల్లగూడెంకి చెందిన పటాపంచల గంగరాజు (35) శుక్రవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఆగిరిపల్లి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. గంగరాజును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ టీడీపీ నాయకులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ కు వచ్చారు. అక్కడ చర్చలు ఫలించకపోవడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్కలం గొల్లగూడెంలో ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ధర్నా నిర్వహిస్తున్నా మంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం గానీ, పార్టీ నాయకులు గాని పట్టించుకోలేదని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నూజివీడు డీఎస్పీ గ్రామానికి చెందిన పెద్దలతో చర్చలు జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.