లైంగిక వేధింపులపై చర్యలు ఎప్పుడు ? | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులపై చర్యలు ఎప్పుడు ?

Jul 12 2025 9:35 AM | Updated on Jul 12 2025 9:35 AM

లైంగిక వేధింపులపై  చర్యలు ఎప్పుడు ?

లైంగిక వేధింపులపై చర్యలు ఎప్పుడు ?

దెందులూరు: కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తొత్తడి వేదకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దెందులూరులో విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీకి మద్యం సేవించి వస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న హోం మంత్రి సైతం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వేధింపులకు పాల్పడిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలన్నారు. తూతూ మంత్రంగా సస్పెండ్‌ చేస్తే 10 రోజుల తర్వాత మళ్లీ కళాశాలకు వస్తారని.. బాధితులకు భద్రత ఏం ఉంటుందని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గణేష్‌

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా లంకలపల్లి వెంకట గణేష్‌ను నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావటం పట్ల గణేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు.

హమాలీల కూలి రేట్లు పెంచాలి

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు నగరంలో మర్చంట్‌ అండ్‌ చాంబర్‌ పరిధిలో హమాలీ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలు నుంచి విజ్ఞాపన యాత్రను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్దకు పదర్శన చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ఐఎఫ్‌టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, అది సరి కాదన్నారు.

ఎస్‌ఎస్‌సీ మార్కుల లిస్టు ఇంటికే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్‌, ఎస్‌ఎస్‌సీ కోర్సులకు ఇటీవల నిర్వహించిన పరీక్షలకు సంబంధించి పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థుల ఇంటికే వస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ప్రవేశాల సమయంలో ఇచ్చిన చిరునామాలకు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పాస్‌ సర్టిఫికెట్లతో పాటు మైగ్రేషన్‌ కం ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లను పంపినట్టు తెలిపారు.

ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

భీమవరం: భీమవరం పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాల వద్ద ర్యాగింగ్‌ అంటూ కలకలం రేగింది. బైపాస్‌ రోడ్డులోని ఈ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 5న జూనియర్‌, సీనియర్‌ విద్యార్థుల వద్ద టాయిలెట్ల వద్ద వివాదం ఏర్పడింది. వివాదానికి కారణమైన ఏడుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్ధి తండ్రి శుక్రవారం కళాశాలకు చేరుకుని వివాదం వివరాలు తమకెందుకు చెప్పలేదంటూ కళాశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీనిపై ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి జి.ప్రభాకరరావును వివరణ కోరంగా వివాదం తన దృష్టికి రాలేదని, వివరాలు తీసుకుంటానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement