
ఉన్నత విద్యామండలి తీరు దారుణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రోజుకో మాట పూటకో విధానంలా ఉన్నత విద్యామండలి తీరు ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. శుక్రవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ డ్యూయల్ డిగ్రీ విధానం అమలు పరుస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి తిరిగి రివ్యూ చేసి సింగిల్ మేజర్ విధానం కొనసాగిస్తామని పేర్కొనడం హాస్యస్పదమన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేక్ హెూల్డర్స్‌తో సంప్రదించకుండా ఇష్టానుసారంగా నెలకో నిర్ణయం చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు. గత నిర్ణయానికి అనుగుణంగా డిగ్రీలో డ్యూయల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఇంటర్న్‌షిప్ భారాన్ని తగ్గించి, మైనర్ సబ్జెక్టులకు క్రెడిట్ పాయింట్స్ పెంచాలని కోరారు. విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు తగిన స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలవడి మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించకపోవడం దుర్మార్గమన్నారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.