
డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట
ఏలూరు రూరల్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా విఽధి, విధానాలపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో మార్గదర్శకాలు అయోమయానికి గురి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు క్రీడా కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేందుకు తప్పుడు విధానాలు రూపొందించారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా క్రీడల విభజన, అర్హతలతో ఆన్‌లైన్ దరఖాస్తు విధానం రూపొందించారని ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 421 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు ఎలా?
ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (బీపీఈడీ) పూర్తి చేయని క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటాలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమిస్తామని కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌లో వెల్లడించడంపై క్రీడా పండితులు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇతర శాఖలకు మాత్రమే సరిపోతుందని, ఉపాధ్యాయ వృత్తికి మాత్రం సరికాదంటున్నారు. ట్రైనింగ్ పూర్తి చేయకుండా క్రీడాకారుడు పిల్లలకు వ్యాయామ విద్య ఎలా బోధిస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఉపాధ్యాయ కోటాలో ఇలాంటి నియమాలు పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ట్రైనింగ్ పూర్తి చేసిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు.
గత ప్రభుత్వంలో పక్కాగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకంలో స్పోర్ట్స్ కోటా అమలు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా క్రీడాకారులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. నాడు ఒక్క క్రీడాకారుడు కూడా విధి, విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే నేడు కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జూనియర్ ఇండియా, ఎస్‌జీఎఫ్‌కు ప్రాధాన్యత లేదా?
స్పోర్ట్స్ కోటాలో జూనియర్ ఇండియా చాంపియన్‌షిప్, నేషనల్ స్కూల్‌గేమ్స్ సర్టిఫికెట్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పక్కా విధి విధానాలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పాయింట్ల విధానంపై గందరగోళం
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాప్) ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా క్రీడల ప్రాధాన్యత, క్రీడాకారుడు సాధించిన సర్టిఫికెట్ల స్థాయిని బట్టి పాయింట్లు కేటాయించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పూరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం శాప్ విధానాలకు విరుద్ధంగా క్రీడలను ఏ,బీ అనే రెండు కేటగిరీలుగా విభజించింది. ఎటువంటి క్రీడల సర్టిఫికెట్లు ఉంటే ఎన్ని పాయింట్లు కేటాయిస్తారో? వెల్లడించలేదు. ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్‌వెల్త్, నేషనల్ గేమ్స్, యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటిన వారితో పోస్టులు పూరిస్తామని చెబుతున్నారు. అయితే ఇందులో ప్రాధాన్యత లేని పలు క్రీడలను సైతం ఏ–కేటగిరీలో చేర్చడం వల్ల అత్యంత పోటీ ఉన్న క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్రీడాకారుల్లో అసంతృప్తి
నియామక ప్రక్రియపై అనుమానాలు
క్రీడల వర్గీకరణతో నిరాశ
పారదర్శకత లేదు
ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు. ఇందులో పక్కా విధి, విధానాలు వెల్లడించాలి. ఇతర ప్రభుత్వ శాఖల్లో సైతం స్పోర్ట్స్ కోటాతో ఉద్యోగాలు పూరించాలి. అప్పుడే ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేదంటే డీఎస్సీ మొత్తం ప్రక్రియ కోర్టు మెట్లు ఎక్కుతుంది.
– టి.కొండలరావు, శాయ్ సెంటర్ రిటైర్డ్ ఇన్‌చార్జి
తప్పుల తడక
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ కోటా విధానం తప్పుల తడకగా ఉంది. బీపీఈడీ ట్రైనింగ్ చేయకుండా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా కేటాయిస్తారు? దీనివల్ల పాఠశాల స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. క్రీడల వర్గీకరణ సైతం సరిగా లేదు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో అత్యధిక పోటీ కల్గిన క్రీడాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ప్రతిభ చాటిన వారికి పాయింట్లు విధానం అమలు చేయాలి.
–కేటీఎస్‌ఆర్ ఆంజనేయులు, రిటైర్డ్ డీఎస్‌డీఓ

డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట

డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట