
వైభవంగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలు జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలు సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలు అందజేశారు. అలాగే రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
నేటి నుంచి ఆర్జిత సేవలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు.