
కోకో రైతుకు సిండికేట్ దెబ్బ
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లతో మాకు సంబంధం లేదు. మేం చెప్పిందే రేటు.. లేకపోతే ఏ కంపెనీ కోకో గింజలు కొనదు. ఇది కోకో వ్యాపారులు సిండికేట్ అయ్యి ఇస్తున్న అల్టిమేటం. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో గింజలు రూ.700 నుంచి రూ.800 పలుకుతుంటే ఏలూరు జిల్లాలో మాత్రం సిండికేట్ వ్యాపారుల వల్ల కేవలం రూ.450కే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కోకో సాగు ఏలూరు జిల్లాలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రామాణికంగా తీసుకుని గతేడాది వరకు అదే ధరలు చెల్లించిన వ్యాపారులు పూర్తిగా సిండికేట్ అయ్యి స్థానికంగా ధరలు నిర్ణయించడంతో కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కోకో విస్తరించింది. కొబ్బరి, పామాయిల్‌లో అంతర్ పంటగా సాగుచేస్తున్నారు. 2018 నుంచి కోకో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఏలూరు జిల్లాలో 2020లో 18,483 ఎకరాలు, 2021లో 20,350 ఎకరాలు ఉన్న కోకో సాగు, 2025 నాటికి 36,290 ఎకరాలకు చేరింది.
గతేడాది పోటీపడి కొనుగోలు
గతేడాది ఏప్రిల్, మే నెలలో కిలో కోకో గింజలు అత్యధికంగా రూ.1000కి పైగా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం ఇక్కడ కోకో సాగుకు భాగా కలిసివచ్చే అంశం. ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఏటా 12 వేల మెట్రిక్ టన్నుల కోకో దిగుబడి ఉంది. గత మూడేళ్లుగా సగటున రూ.350 ధరతో ప్రారంభమై, 2024 ఏప్రిల్ నాటికి రూ.1040కి చేరింది. మరో 30 ఏళ్ల పాటు కోకోకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దేశీయ అవసరాలకు ఏటా 1.10 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నప్పటికీ దేశంలో 30 వేల మెట్రిల్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలింది విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఉన్న ఎకరం పొలం కౌలు ధర రూ.లక్ష నుంచి అత్యధికంగా రూ.1.20 లక్షలకు చేరింది. గతంలో నాణ్యతతో సంబంధం లేకుండా ఎలాంటి కోకో గింజలనైనా ఒకే ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వ్యాపారులు పూర్తిగా సిండికేట్‌గా మారి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు.
70 శాతం మండలీజ్ కంపెనీ కొనుగోలు
కోకో గింజలను స్థానంగా మండలీజ్, జిందాల్, హెరిటేజ్, డీపీ చాక్లెట్, సూర్య ట్రేడర్స్‌తో పాటు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వీటిలో 70 శాతానికి పైగా కొనుగోళ్లు మండలీజ్ కంపెనీ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వారం రూ.750 నుంచి రూ.800 ధరకు కోకోను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా 5 నుంచి 10 శాతం వ్యత్యాసంలో అదే ధర చెల్లించాలి. వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ. 450 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఈ ఏడాది జనవరిలో రూ.650తో ప్రారంభమైన లోకల్ మార్కెట్ ధర మే నాటికి రూ.450కు చేరింది. దీనిపై కోకో రైతు సంఘం పోరు బాట పట్టి కమిషనరేట్ ముట్టడి మొదలుకుని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.
కోకో రైతుల మొర పట్టని సర్కారు
గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి వద్ద సమావేశం నిర్వహించి, వ్యవసాయశాఖ మంత్రి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని కోరింది. చివరకు కంపెనీలు రూ.550కు కొనుగోలు చేస్తాయని చెప్పి మాట తప్పారు. దీంతో పాటు ఎంపిక చేసిన రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేయడం, పూర్తి ప్రాసెసింగ్ రైతే చేయాలని షరతులు విధించడం, అంతర్జాతీయ మార్కెట్ వర్తించదు, మేం ఇచ్చిన రేటే తీసుకోవాలని నిర్ణయించి మరీ మార్కెట్‌ను శాసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కోకో సాగుదారులు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు.
న్యూస్‌రీల్
రోజురోజుకూ ధరల తగ్గింపు
అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.750కి పైగానే ధర
స్థానికంగా రూ.450 మాత్రమే ఇస్తున్న వైనం
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.100 చొప్పున తగ్గుదల
ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో కోకో సాగు
మాపై ఉదాసీనత ఎందుకు?
విజయరాయిలో 20 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నాను. సీజన్‌లో 100 గ్రాములకు 80 నుంచి 100 గింజలు వస్తాయి. అన్ సీజన్‌లో 100 గ్రాములకు 120 నుంచి 140 గింజలు వస్తాయి. రెండూ కలిపి సంక్రాంతి తరువాత అమ్ముకునే వాళ్ళం. హఠాత్తుగా ధర తగ్గించేశారు. ప్రస్తుతం రూ 350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.750 నుంచి రూ.800 వరకు కొనుగోలు చేస్తున్నారు.
– కొనేరు సతీష్‌బాబు, విజయరాయి
నష్టాల్లో మునిగిపోయాం
చిన్న సన్నకారు కోకో రైతులు నష్టాల్లో మునిగిపోయారు. గతేడాది రూ.1040 వరకు కోకోకు గిట్టుబాటు ధర ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. మండలీజ్ వ్యాపారస్తులందరూ సిండికేట్‌గా మారి రైతులను ముంచేశారు. మండలీజ్ కంపెనీ బయట వ్యాపారస్తులని రానివ్వకుండా చేసి, చిన్న రైతులకు నష్టం చేస్తున్నారు.
– వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం గ్రామం

కోకో రైతుకు సిండికేట్ దెబ్బ

కోకో రైతుకు సిండికేట్ దెబ్బ

కోకో రైతుకు సిండికేట్ దెబ్బ

కోకో రైతుకు సిండికేట్ దెబ్బ