
ఘనంగా నృసింహ జయంతి
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీ నృసింహ మూలమంత్ర హోమం, నీరా జన మంత్రపుష్పం జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగలను ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, జి.అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఈఓ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
అరటి రైతులకు మాజీ సీఎం జగన్ చేయూత హర్షణీయం
దెందులూరు: కడప జిల్లాలో 2024 మార్చిలో కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన 670 మంది అరటి రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం అందించడం వైఎస్ కుటుంబానికి రైతులపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఏలూరు జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం నేత, వైఎస్సార్‌సీపీ నేత ఉప్పలపాటి సత్తిబాబు అన్నారు. ఆదివారం సంక్షేమ సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అరటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మాజీ సీఎం జగన్ హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘ నేత సత్తిబాబు తెలిపారు.
14న ఏపీటీఎఫ్ ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో నిర్వహించనున్న భారీ ధర్నాకు టీచర్లు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మూడు రకాల పాఠశాల వ్యవస్థను అమలు చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని, సంపాదిత సెలవుల నగదును ఖాతాల్లో జమ చేయాలని, 11వ పీఆర్‌సీ ఆర్థిక బకాయిలతో పాటు అన్నిరకాల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్జీటీలను హెచ్‌ఎంలుగా నియమించాలి
నూజివీడు: సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని సెకండరీ గ్రే డ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం డిమాండ్ చేశారు. నూజివీడులో ఆదివారం ఆయన మాట్లాడుతూ హైస్కూళ్లలో మిగులుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఆదర్శ పాఠశాలలకు హె చ్‌ఎంలుగా నియమించాలని ప్రభుత్వం ఆలోచన సమంజసం కాదన్నారు. అలాగే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20 ఉండాలని, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమికోన్నత పాఠశాలల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా సోమ వారం నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 13,103 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఫస్టియర్ విద్యార్థులు 10,068 మంది కోసం 34 పరీక్షా కేంద్రాలు, సెకండియర్ విద్యార్థులు 3,035 మంది కోసం 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను, ఇన్విజిలేటర్లను ఇప్పటికే నియమించి వారికి శిక్షణ ఇచ్చారు.
ఆప్కాబ్ చైర్మన్‌గా గన్ని
భీమడోలు: ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) చైర్మన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.