
ధాన్యం కొనుగోలులో దళారీ రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ధాన్యం కొనుగోళ్లలో తెరమరుగైన దళారీ వ్యవస్థ కూటమి సర్కారు పాలనలో ఊపిరిపోసుకుంది. పూర్తిగా సర్కారు మద్దతుతో దళారులు నేరుగా కొనుగోళ్లకు తెరలేపారు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. మరో వైపు వేలం పాట తరహాలో ప్రతి వారం టార్గెట్లు తగ్గించడం, పెంచడం వంటి చర్యలతో కొనుగోళ్లు నిలిచిపోయి తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫలితంగా మద్దతు ధర ఉన్నా అన్నదాతకు అందని పరిస్థితి. ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 77 వేల ఎకరాల్లో 3.53 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో 2.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 9.25 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. రెండు జిల్లాలో 50 శాతం టార్గెట్‌తో రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించింది. ఏలూరులో 1.50 లక్షలు, పశ్చిమగోదావరిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ క్రమంలో రైతు సంఘాలు, రైతుల నుంచి టార్గెట్ పెంచాలన్న ఒత్తిడితో దశలవారీగా పెంచే క్రమంలో దళారులకు పూర్తి అవకాశం కల్పించారు. రబీ సీజన్ ప్రారంభ సమయంలో రూ.1740 ఉన్న ఏ– గ్రేడ్ రకం, రూ.1725 ఉన్న సాధారణ రకం 75 కేజీల బస్తా దళారుల దెబ్బకు రూ.1300కు పడిపోయింది.
సేవా కేంద్రాల్లోనూ దళారులే
రైతు సేవా కేంద్రాల్లోనూ దళారుల హవా కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల వివరాలు నమోదు చేసి వే బ్రిడ్జిలో కాటా వేయించి ట్రక్ షీట్ తీసుకుంటే అక్కడ నుంచి నేరుగా మిల్లుకే వెళ్ళిపోతుంది. ఏ మిల్లుకు వెళ్ళింది వివరాలు తెలియకపోవడంతో ధర తగ్గించడం, తరుగు పేరుతో కొంత తీయడం ఇలా ఘటనలకు ఆస్కారం ఉండేది కాదు. ఇప్పుడు నేరుగా నచ్చిన మిల్లుకు తోలుకోవడంతో మిల్లర్లు నిర్ణయించిన ధరే రైతుకు అందుతుంది. తరుగు, తేమ శాతం ఎక్కువగా ఉందని రేటు తగ్గిస్తున్నారు. గోనెసంచులకు పూర్తిగా మిల్లర్లపైనే ఆధారపడి ఉన్నారు. వీటన్నింటితో పాటు వందలాది గ్రామాల్లో దళారులే రైతుల వద్ద ధాన్యం సేకరించి రైతుల పేరుతో ట్రక్‌షీట్ జనరేట్ చేయించి క్వింటాకు ఖర్చులతో కలిపి రూ.200 నుంచి రూ.300 వరకు అవసరాన్ని బట్టి కమిషన్ తీసుకుని ధాన్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో సగటున రూ.1400 నుంచి రూ.1500 లోపే రైతుకు దక్కుతుంది.
వేలం పాట తరహాలో కొనుగోళ్ల లక్ష్యం
ఏలూరు జిల్లాలో కొనుగోళ్ల లక్ష్యం వేలం తరహాలో సాగింది. తొలుత 1.50 లక్షల టన్నులు లక్ష్యంగా నిర్ణయించారు. తరువాత 1.80 లక్షల టన్నులు, ఆ తరువాత 2 లక్షల టన్నులు, ఆ తరువాత 2.50 లక్షల మెట్రిక్ టన్నులు, చివరిగా బుధవారం 2.70 లక్షల మెట్రిక్ టన్నులు నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి గాను 5 లక్షల టార్గెట్ నిర్ణయించారు. మంత్రి మనోహర్ మంగళవారం భీమవరంలో పర్యటించిన క్రమంలో ఇంకో లక్ష టార్గెట్ పెంచారు.
దళారులు నిర్ణయించిన ధరకే అమ్మకాలు
మిల్లుల్లో రైతుల పేరిట దళారులే విక్రయిస్తున్న వైనం
గత ప్రభుత్వంలో దళారులకు చెక్
దిగుబడిపై అంచనా లేక రైతుతో చెలగాటం
పెట్టుబడి కూడా రాలేదు
50 ఎకరాలు కౌలుకు సాగు చేశాను. సార్వాలో నష్టం వచ్చి నా దాళ్వాలోనైనా గిట్టుబాటుకు అమ్మి నష్టాన్ని పూడ్చుకుందామనుకున్నా. మాసూళ్ల ప్రారం భంలో పండించిన ప్రతి గింజ కొంటామని అధికారులు, కూటమి ప్రభుత్వ పాలకులు హామీలిచ్చారు. వారి మాటలు నమ్మి రైతు సేవా కేంద్రానికి వెళితే టార్గెట్లు అయిపోయాయని చెప్పి సంచులు ఇవ్వడం మానేసారు. పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది.
– పెద్దిరెడ్డి భోగయ్య, కౌలు రైతు,
ఎంఎంపురం, భీమడోలు మండలం
దళారులకు ప్రభుత్వం పెద్దపీట
చివరి గింజ వరకు కొంటామని చెప్పి వారానికో టార్గెట్ పెట్టి రైతులను తీవ్ర ఆగచాట్లకు గురిచేస్తున్నారు. జిల్లాలో పంట నష్టం వాటిల్లినా మొక్కుబడి నివేదికలు తప్పా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి గింజ కొనుగోలు చేశాం. దళారుల ఆస్కారం లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థకు పెద్దపీట వేసింది.
– దూలం నాగేశ్వరరావు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ధాన్యం కొనుగోలులో దళారీ రాజ్యం

ధాన్యం కొనుగోలులో దళారీ రాజ్యం