డిప్యూటీ సీఎం ఇలాకాలో సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు
దెందులూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గం లో మల్లం గ్రామంలో దళిత కుటుంబాన్ని పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటని ఏలూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు తెర ఆనంద్, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లం ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మోరు రామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శులు గొల్ల కిరణ్ దేవదాసు ప్రేమ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ షాక్ వల్ల దళితుడు సురేష్ మృతి చెందడం, అతనికి న్యాయం చేయాలని దళితులు, గ్రామస్తులు, మద్దతుదారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం, మద్దతు తెలియజేయడం నేరమా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడం దళితులపై ఆయన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని, సహకరించిన వారిని, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొల్లేరు భూములన్నీ చిత్తడి నేలలేనా?
సుప్రీంకోర్టు ఆర్డర్ అంటూ అటవీ అధికారులు వేధింపులు
దెందులూరు: కొల్లేరు భూములన్నీ జిరాయితీ భూములంటూ, సుప్రీం కోర్టు ఆర్డర్ అని చెబుతూ అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మోరు రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు రూరల్ మండలం కొల్లేరులో కలకుర్రు, పెద్ద ఎడ్ల గాడితో పాటు పలు గ్రామాల్లో జిరాయితీ భూములను విలేకరులకు చూపించారు. ఇవి చిత్తడి నేలలని అటవీ అధికారులు అనడం విడ్డూరంగా ఉందని ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కొల్లేరు ప్రాంతం జిరాయితీ చిత్తడి భూములు చెరువులు కొల్లేరు ప్రాంత జీవన విధానం వృత్తి ఇవన్నీ ఏమి తెలుసు? అని ఆయన ప్రశ్నించారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు చేపల సాగు చేసుకుని దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్నారన్నారు. కొల్లేరు ప్రాంత వ్యక్తుల జిరాయితీ భూములను వారికే ఇచ్చేయాలని లేదా ప్రభుత్వం నష్టపరిహారమైన చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథంతో దశాబ్దాలుగా కొల్లేరుని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాదిమంది జీవన విధానాన్ని, భవిష్యత్‌ను, భద్రతను పరిరక్షించాలని రాష్ట్ర నాయకులు మోరు రామరాజు కోరారు.


