ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్‌పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్‌ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు.
బిల్డింగ్ నుంచి పడి వ్యక్తి మృతి
కై కలూరు: పడక కుర్చీపై చల్లిగాలికి డాబాపై పడుకున్న వ్యక్తి కింద పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం కై కలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన కమతం యేబేలు(58) ఈ నెల 22న డాబాపై రాత్రి పడక కుర్చీలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి కింద పడి ఉన్నాడు. వెంటనే కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి, విజయవాడ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారని పోలీసులు చెప్పారు. కుమార్తె దాసరి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఉపాధి కల్పన కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ఉపాధి కల్పన పథకంలో లబ్ధి కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం శుక్రవారం తెలిపారు. ఈ పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవ రంగానికి రూ. 20 లక్షలు సబ్సిడీ రుణం ఇస్తారన్నారు. ఈ పథకంలో నూతన ప్రొజెక్టులకు మాత్రమే రుణం ఇస్తారన్నారు. అభ్యర్థలు సంబంధిత వెబ్‌సైటులో సమాచారాన్ని పూరించి అవసరమైన ధ్రువపత్రాలు జతపర్చాలన్నారు.
పోక్సో కేసు నమోదు
భీమవరం: భీమవరం రెండో పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల కె.గణేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లితో కొన్నేళ్లుగా గణేష్ సహజీవనం చేస్తున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. చదువు మానేసి ఇంట్లో ఉంటున్న బాలికపై ఎవరూ లేని సమయంలో శరీరంపై చేతులు వేసేవాడు. ఎవరితోనైనా చెబితే బాగుండదని హెచ్చరించేవాడు. తన తల్లిని శుక్రవారం కొడుతుండగా ఎందుకు కొడుతున్నావని అడిగితే మీద చేతులు వేసి దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.


