
కృత్రిమ అవయవాల పంపిణీ
ఏలూరు (టూటౌన్): ఏలూరు దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ నిర్వహించారు. సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఫిజియోథెరపీ, ఆడియోలజీ, స్పీచ్ థెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం 08812 –249297,7386565469లో సంప్రదించాలన్నారు.
మెగా డీఎస్సీకి ఉచిత కోచింగ్
ఏలూరు (టూటౌన్): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలకు బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఆర్‌వి.నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, టీటీసీ, బీఎడ్, కుల, ఆదాయ నివాస ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 8686180018 నెంబరులో సంప్రదించాలన్నారు.
బాధితులకు
సత్వర న్యాయం అందాలి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ప్రజలు ఆయా సమస్యలపై పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 36 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్ శేఖర్ పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పోలవరం రూరల్: ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కలెక్టర్ కే వెట్రిసెల్వి, జేసీ పీ ధాత్రిరెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో సమావేశ హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ కాపర్ డ్యామ్, గ్యాప్– 1, 2 తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ కూడా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్‌ఓ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయన్నారు.

కృత్రిమ అవయవాల పంపిణీ

కృత్రిమ అవయవాల పంపిణీ