
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నవారు ఎందరో. కుటుంబానికి ఆధారమైన వ్యక్తినో కోల్పోతే వారికి తీరని నష్టం కలగడమే కాక ఎంతో మనోవేదన తప్పదు. ఈ నేపథ్యంలో వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు జిల్లా పరిధిలో స్పీడ్ గన్ పరికరాలను ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని కొలవడమే కాక మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తిస్తూ వారికి జరిమానా విధిస్తున్నారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే 34 బ్లాక్ స్పాట్స్‌ను జిల్లా అధికారులు గుర్తించారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు, స్టాపర్లు ఏర్పాటు చేస్తూ నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఏలూరు పరిధిలో ఆశ్రం హాస్పిటల్ జంక్షన్, రత్నాస్ హోటల్, దెందులూరు పరిధిలో సత్యనారాయణపురం ఎక్స్ జంక్షన్, కొవ్వలి బ్రిడ్జి, గుండుగొలను, భీమఢొలు పరిధిలో రైల్వేగేటు, అయ్యప్పస్వామి గుడి, పూళ్ల, ద్వారకాతిరుమల పరిధిలో ఎం.నాగులపల్లి, గుణ్ణంపల్లి, చేబ్రోలు పరిధిలో కై కరం సెంటర్, ఉంగుటూరు, నారాయణపురం, జంగారెడ్డిగూడెం పరిధిలో తాడువాయి సెంటర్, జల్లేరు వాగు, వేగవరం సెంటర్, నూజివీడు పరిధిలో ఎంఆర్ అప్పారావు కాలనీ ఎక్స్ రోడ్డు, తుక్కులూరు సెంటర్, ఇక స్టేట్ హైవేలో తడికలపూడి, రాఫిన్ టవర్స్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
7 స్పీడ్ గన్స్‌తో తనిఖీ
ఏలూరు జిల్లాలో జాతీయ రహదారుల్లో వాహనాల వేగం నియంత్రణకు స్పీడ్ గన్స్‌తో బ్రేకులు వేసేలా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 7 స్పీడ్ గన్స్ ఉండగా, రెండు స్పీడ్ గన్స్‌తో పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా జాతీయ రహదారుల్లో వాహనాల వేగాన్ని తనిఖీ చేస్తూ మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలకు ఈ–చలానా వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే వారికి రవాణాశాఖ ఈ–చలానా సైట్ నుంచి ఫైన్స్ వేస్తున్నారు. ఇలా సత్యనారాయణపురం బ్లాక్ స్పాట్ వద్ద ఐదు కేసులు నమోదు చేయగా, ఏలూరు రూరల్ పరిధిలో రత్నాస్ హోటల్ వద్ద ఎనిమిది కేసులు నమోదు చేశారు.
క్షతగాత్రుల రక్షణకు ప్రాధాన్యం
రోడ్డు ప్రమాదాలను నియంత్రించటంతోపాటు ప్రమాదాలు చోటుచేసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ తరలించి ప్రాణాలను రక్షించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తోంది. ఏలూరు జాతీయ రహదారి 216పై, రాష్ట్ర రహదారుల్లోనూ 9 హైవే సేఫ్టీ వాహనాలు పనిచేస్తున్నాయి. ఒక్కో వాహనంపై రెండు షిఫ్ట్‌లలో నలుగురు పోలీస్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.
హైవే, రాష్ట్ర రహదారుల్లో వాహనాల వేగంపై డిజిటల్ నిఘా
రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్.. వేగం మితిమీరితే కేసులు
ఏలూరు జిల్లా పరిధిలో 34 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు
సిద్ధంగా 9 హైవే పెట్రోలింగ్ బృందాలతో సహాయక చర్యలు
జిల్లాలో గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలు ఇలా..
సంవత్సరం ప్రాణాంతకమైనవి ప్రాణాంతకం
కానివి
2021 251 367
2022 244 389
2023 256 377
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
జాతీయ రహదారుల్లో మితిమీరిన వేగంతో వాహనాలను నడపటం ద్వారా అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా స్పీడ్‌గన్స్‌తో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాం. వేగం కంటే మనిషి ప్రాణం విలువైందనీ, కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని అవగాహన కల్పిస్తున్నాం. రాత్రి వేళల్లో లారీ డ్రైవర్లకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వేగాన్ని నియంత్రించేలా స్టాపర్లు ఏర్పాటు చేయటం, హైవే పెట్రోలింగ్ వంటివి నిర్వహించేలా శ్రద్ధ వహిస్తున్నాం.
– డీ మేరీ ప్రశాంతి, ఏలూరు జిల్లా ఎస్పీ
