
తాడేపల్లిగూడెంలో సూచనలిస్తున్న జేసీ
తాడేపల్లిగూడెం రూరల్: పోలింగ్ కేంద్రాలను అన్ని మౌలిక సదుపాయాలతో పకడ్బందీగా తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎల్.అగ్రహారం, సుబ్బారావుపేట, కుంచనపల్లి, పెంటపాడు మండలంలోని రావిపాడు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం సుబ్బారావుపేట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఆయన వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.దుర్గేష్, తహసీల్దార్ దుర్గాకిషోర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. తణుకు మండలం మండపాక గ్రామ శివారు ఎర్రనీలిగుంట, ఇరగవరం మండలం రేలంగి శివారు గమళ్లపాలెం గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, పలు పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు.