
అలుగులగూడెంలో బాధితులతో మాట్లాడుతున్న ఏఎస్పీ భాస్కర్
దెందులూరు: దెందులూరు–అలుగులగూడెం గ్రామస్తుల పరస్పర దాడుల నేపథ్యంలో పూర్వ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పాటు శాంతి కమిటీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అడిషినల్ ఎస్పీ ఎంజేవీ భాస్కర్ అన్నారు. గురువారం అలుగులగూడెం, దెందులూరు గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. సంఘటన పూర్వాపరాలు, దాడి వివరాలు తెలుసుకుని బాధితుల ఆవేదన తెలుసుకున్నారు. అలుగులగూడెం రైల్వేట్రాక్ వద్ద ఆయన మాట్లాడుతుండగా దెందులూరు యాదవుల వీధి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాగా అలుగులగూడెం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో దాడి చేశారు. తమ గ్రామానికి చెందిన ముగ్గురిని కత్తి, రాడ్డుతో గాయపరిచి మళ్లీ ఇక్కడ ఏం జరిగిందో చూడటానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి మోటార్‌సైకిల్‌ను కింద పడవేయగా పోలీసులు అతడిని అక్కడి నుంచి దెందులూరు గ్రామానికి పంపించి వేశారు. అడిషనల్ ఎస్పీ హుటాహుటిన రెండు బెటాలియన్లను, డీఎస్పీ, ఐదుగురు ఎస్సైలను సంఘటనా స్థలానికి పిలిపించారు. అలుగులగూడెం గ్రామస్తులను గ్రామానికి, దెందులూరు యాదవుల వీధిలోని రామాలయం వద్ద ఉన్న వారిని వారి ఇళ్లకు పంపించి వేశారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
అలుగులగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై బుధవారం రాత్రి జరిగిన దాడి, దౌర్జన్యం సంఘటనల్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని దెందులూరు ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్ విచారణ నిర్వహిస్తారన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు.
రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్
ఏఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు అలుగులగూడెంలో ఒకటి, దెందులూరులో మరో పికెటింగ్ ఏ ర్పాటు చేశారు. నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్ రెండు గ్రామాల్లో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఏఎస్పీ భాస్కర్