
రుద్రనేత్రుడి విగ్రహం
ఆకివీడు: శ్మశాన వాటికలు.. ఒకప్పుడు అటు వైపు వెళ్లాలంటే జనం భయపడేవారు. పుర్రెలు, ఎముకలు, చెత్తచెదారంతో అటు వైపు వెళ్లేందుకు జంకేవారు. కొందరైతే బహిర్భూమిగా వాడేవారు. అలాంటి రుద్రభూమి నేడు స్వర్గధామాల్ని తలపిస్తున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఆధునిక వసతులతో, అందమైన శ్మశానాల్ని నిర్మిస్తున్నారు.
శవంతో శ్మశానానికి వెళ్లిన వ్యక్తులకు ఆ ప్రాంతాన్ని చూస్తే ఒక రకమైన ఆందోళనకర వాతావరణం కనిపించేది. నేడు శ్మశాన భూములు ప్రశాంత వాతావరణంతో, పచ్చగా, పరిశుభ్రతతో ఉంటున్నాయి. కోటీశ్వరుడైనా, బికారైనా ఆఖరి మజిలీ ఇక్కడే. ప్రతి ఒక్కరికీ మోక్షం ఇక్కడే అని భావించి శ్మశాన వాటికల అభివృద్ధికి జిల్లాలోని పలు గ్రామాల్లోని దాతలు ఇటీవల ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 409 గ్రామ పంచాయతీల పరిధిలో రెండు, మూడు శ్మశాన వాటికలున్నాయి. వీటిలో సుమారు 120 నుంచి 150 స్మశాన వాటికల్ని ఇటీవల అభివృద్ధి పరిచారు.
స్వర్గధామంగా రుద్రభూమి
రుద్రభూములు స్వర్గధామాలుగా కన్పిస్తున్నాయి. గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధి వలే దాతలు రుద్రభూముల అభివృద్ధికి విరాళాలిస్తున్నారు. లోతట్టులో ఉన్న రుద్రభూములలో ప్రభుత్వ నిధులతో పూడిక పనులు పూర్తి చేశారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ నిధులు, ఇతరత్రా నిధులతో రుద్ర భూములు అందంగా కన్పిస్తున్నాయి. రుద్రభూముల అభివృద్ధికి గ్రామాల్లో పెద్ద పీట వేస్తున్నారు. హిందూ, క్రైస్తవ శ్మశాన వాటికల అభివృద్ధితో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికల్లో చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీ పరిధిలో కుళాయి సౌకర్యం కల్పిస్తున్నారు. గార్డెన్లు పెంచుతున్నారు. సుందరవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. శవ దహన కార్యక్రమాలకు వచ్చే బంధుమిత్రులు వేచి ఉండే గది, స్నానాదులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రుద్రనేత్రుడు, కాటికాపరిల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతిమ మజిలీకి మోక్ష ధామంగా శ్మశనాలు ఉన్నాయని పలు గ్రామాల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్మశానాల్లో అన్ని సౌకర్యాలు
కొల్లేరు తీరంలోని పెద కాపవరంలో నాలుగేళ్ల్ల క్రితమే కుటీరాన్ని తలపిస్తూ శ్మశాన భవనాన్ని నిర్మించారు. శవ దహనాలు చేసిన అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రపరచడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయ్యింది. విశ్రాంతి భవనం, స్నానాలకు సౌకర్యం ఉంది.
– కఠారి రామకృష్ణ(రాము),
పెద కాపవరం, ఆకివీడు మండలం
క్రైస్తవ శ్మశానాల్ని అభివృద్ధి చేయాలి
క్రైస్తవ స్మశాన వాటికల్ని అభి వృద్ది చేయాల్సిన అవసరం ఉంది. దాతల సహకారంతో ఆకివీడులో ప్రహరీ గోడ నిర్మిం చాం. స్థల పూడికకు ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. అన్ని గ్రామాల్లోని క్రైస్తవ స్మశాన భూముల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి.
– జీ.జోసఫ్‌రాజు,
సీబీసీఎన్‌సీ టౌన్‌న్ చర్చి కార్యదర్శి, ఆకివీడు
ఆకివీడులోని వెలంపేట వద్ద దాతల సహకారంతో అభివృద్ధి చేసిన హిందూ శ్మశాన వాటిక
న్యూస్‌రీల్

వెలంపేట ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద కాటికాపరి విగ్రహం

వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలకు కలెక్టర్‌ను ఆహ్వానిస్తున్న ఈఓ

