
పండిత సత్కార వేడుకలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు
వేడుకగా శ్రీవారికి ఉగాది ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఉగాది ఉత్సవం బుధవారం రాత్రి కనుల పండువగా జరిగింది. స్థానిక ఉగాది మండపంలో ఈ వేడుకను అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయం నుంచి ఉగాది మండపం వద్దకు వెండి శేష వాహనంపై తరలివచ్చారు.
ఉభయ దేవేరులతో శ్రీవారు కొలువైన శేషవాహనం ఉగాది మండపం వద్దకు చేరుకునే సరికి అక్కడున్న భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామి వారికి నీరాజనాలు సమర్పించారు. మండపంలో ఏర్పాటు చేసిన రజిత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు, పండితులు శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించి, రాశి ఫలాలను చదివి భక్తులకు వినిపించారు. అలాగే శ్రీవారు, అమ్మవార్లకు నీరాజనాలను సమర్పించారు. ఉగాది ఉత్సవం జరగడానికి ముందు స్వామివారి నిత్య కల్యాణ మండపంలో పండితులను, అర్చకులను, దాతలను ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ.నివృతరావు ఘనంగా సత్కరించారు. అనంతరం వేదిక మీద వెండి శేషవాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లకు అర్చకులు హారతులిచ్చారు. శ్రీవారి క్షేత్రం భక్తజన సంద్రమైంది. తెలుగు నూతన సంవత్సరం తొలిరోజు స్వామి, అమ్మవార్లను దర్శిస్తే ఏడాదంతా సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈవో త్రినాథరావు పాల్గొన్నారు.

ఉగాది మండపంలో పంచాంగ శ్రవణం