
రెండో మత్స్యకార సంఘం వద్దు
టి.నరసాపురం: బొర్రంపాలెంలో రెండో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయవద్దు అంటూ అమలులో ఉన్న మత్స్యకార సహకార సంఘ నాయకులు బత్తుల రమేష్, గుండె చిన్న చిట్టయ్య పలువురు సభ్యులు బుధవారం ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బొర్రంపాలెంలో ఒకే మత్స్యకార సంఘం ఉందన్నారు. ఆ సంఘంలో 300 మంది సభ్యులు ఉండి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయంలో బొర్రంపాలెం రేవులో చేపల వేటకు వెళ్లి జీవనోపాధి సాగిస్తున్నామన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక మత్స్యకార సంఘం అమలులో ఉండగా మరో సంఘం ఏర్పాటు చట్ట ప్రకారం తప్పని వివరించారు. కొత్త సంఘం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జెడీ, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను సమర్పించామని వివరించారు.

రెండో మత్స్యకార సంఘం వద్దు