
హడలెత్తిన భీమడోలు
భీమడోలు: మంగళవార అర్ధరాత్రి భీమడోలు హడలిపోయింది. క్షతగాత్రులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో, అంబులెన్స్‌లు, పోలీసుల సైరన్‌లతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆగి ఉన్న వ్యాన్‌ను మరో వ్యాన్ ఢీకొనడంతో తణుకుకు చెందిన కోడూరి వెంకట రామచరణ్ (17) అనే యుడకుడు అక్కడికక్కడే మృతి చెందగా గుంటూరు జిల్లా తిమ్మలపాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ మామిడి జయరామ్, భార్య మామిడి ప్రశాంతి క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ఇరుక్కున దంపతులను బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు
అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు ట్రాఫిక్ కోన్‌లను గుర్తించకుండా సడన్ బ్రేక్ కొట్టి ఢీకొంది. దాని వెనుక మరో రెండు బస్సులు రాగా మొత్తం మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్సు డ్రైవర్‌తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో ఇరుక్కున్న బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జయ్యాయి. మూడో బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పెదపట్నం బాపన్న, అదే జిల్లాలోని ద్రాక్షారామలోని వనుం రామారావు, రావులపాలెంలోని లక్ష్మీపురంనకు చెందిన కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలకు గాయాయ్యాయి. మరో బస్సులో అమలాపురంలోని నడిపూడి విత్తనాల నాగరాజు, హైదరాబాద్‌కు చెందిన కేసినకుర్తి చంటిబాబు, విత్తనాల పవన్‌కుమార్, పీసకాయల మోగవల్లిక, శ్రీపూర్ణ దీప్తి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో భార్యాభర్తలు కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
అర్ధరాత్రి వరుస ప్రమాదాలు
యువకుడి మృతి, పది మందికి తీవ్ర గాయాలు
అన్నకు బై చెబుదామని వచ్చి..
తణుకుకు చెందిన కోడూరి దుర్గాలోకేష్, వెంకట రామచరణ్ (17) అన్నదమ్ములు. వీరు అమ్మమ్మ ఊరైన పోలసానిపల్లి వచ్చారు. తండ్రి లేకపోవడంతో దుర్గాలోకేష్ చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకట రామచరణ్ ఇంటర్ చదువుతున్నాడు. లోకేష్ గుంటూరు జిల్లా వినుకొండలోని చేపల ప్యాకింగ్‌కు రాత్రి బయలుదేరాడు. అన్నను భీమడోలు రైల్వేగేటు వద్ద డీసీఎం వాహనం ఎక్కించి రామచరణ్ బై చెబుతుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తన కళ్లముందే తమ్ముడు మృతి చెందడంతో దుర్గాలోకేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

హడలెత్తిన భీమడోలు

హడలెత్తిన భీమడోలు