
అక్రమ కేసులకు బెదరం
ఏలూరు (టూటౌన్): అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడరని, పార్టీ మూల స్తంభాలు కార్యకర్తలే అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు క్రిస్టల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ఏలూరు జిల్లా సర్వ సభ్య సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ పరంగా ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమని చెప్పారు.
హామీలు అమలు చేయలేక సతమతం
ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. పాలక ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందని తప్పుపట్టారు. అక్రమ కేసులు పెడుతున్నారని, కొన్ని చోట్ల చంపడం వంటి నీచమైన పనులు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి హింసించారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ‘పేదలకు మూడు సెంట్లతో పాటు.. నాలుగు లక్షలు ఇస్తామన్నారు.. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎంతమందికీ ఇళ్లు కట్టారో చెప్పే దమ్ముందా.. జగనన్న కాలనీ బోర్డులు మార్చడమే వీరి అభివృద్ధి. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్నారు. అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదు’ అని దూలం నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పార్టీ శ్రేణుల ఎంపికలో నియమ నిబంధనలకు పెద్ద పీట వేశారన్నారు.
వైఎస్సార్‌సీపీకి మూల స్తంభాలు కార్యకర్తలే
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయం
పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశంలో డీఎన్నార్