
కడుపు కొట్టిన సర్కారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సర్కారు బడుగుల ఉపాధికి గండికొడుతుంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడటంతో ప్రారంభమైన సర్కారు కక్షపూరిత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపుతున్న రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో 395 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోనున్నారు. వచ్చే నెల నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన బాట పడుతున్నారు. రేషన్ షాపుల్లో అవకతవకలకు చెక్ పెట్టడం.. గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలకు పరిష్కారంగా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు ప్రవేశపెట్టింది. జిల్లాలో ప్రతి మూడు రేషన్‌షాపులకు ఒక డోర్ డెలివరీ వాహనాన్ని కేటాయించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఈ వాహనాలను అందించింది. 395 వాహనాలను జిల్లాలోని 1123 రేషన్ షాపులకు అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,31,044 రేషన్‌కార్డుదారులకు ప్రతి నెల 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లను ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. ఒక్కొక్క వాహ నాన్ని రూ.5.80 లక్షల ఖర్చుతో కొనుగోలు చేస్తే.. 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 50 శాతం వాహన ఆపరేటర్ నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించుకునేలా వాహనాలను పంపిణీ చేశారు. 2021 జనవరిలో ప్రారంభమైన ఈ వ్యవస్థ 72 నెలల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 72 వాయిదాలు చెల్లించారు. మరో 20 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి.
నాడు వలంటీర్లు.. నేడు ఆపరేటర్లు
కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే జిల్లాలో సుమారు 10,800 మంది వలంటీర్ల కడుపుకొట్టింది. ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. తాజాగా 395 మంది ఎండీయూ ఆపరేటర్లను తొలగించేశారు. ఆపరేటర్‌కు నెలకు రూ.21 వేలు జీతం ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కాగా అమలయ్యేలా చేసింది. దీని కోసం జిల్లాలో 82.95 లక్షలు ప్రతి నెల ఖర్చు చేస్తోంది. ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. మళ్ళీ రేషన్ షాపుల వద్దకు జనాలు వెళ్ళి క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడే పరిస్థితులు తెస్తున్నారు.
ఉపాధిపై దెబ్బకొట్టారు
నా జీతంతో నా కుటుంబం జీవిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మా అవసరం లేదంటూ రద్దు చేసింది. ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రత్యా మ్నాయం చూపించాలని కోరుతున్నాం.
– కుంచే నాగిరెడ్డి, ఎండీయూ డ్రైవర్,
అయ్యవారిరుద్రవరం, మండవల్లి మండలం
మా పరిస్థితి అగమ్యగోచరం
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పోషణ భారం కానుంది. కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదు. మా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
– ధనికొండ దుర్గారావు, డ్రైవర్
జిల్లాలో నిలిచిపోనున్న 395 ఎండీయూ వాహనాలు
దశలవారీగా వ్యవస్థ నిర్వీర్యం
నాడు వలంటీర్లు, నేడు రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లు

కడుపు కొట్టిన సర్కారు

కడుపు కొట్టిన సర్కారు