
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 34 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,92,94,035 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 556 గ్రాముల బంగారం, 8.100 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.66,500 లభించినట్టు చెప్పారు.
ఈఏపీ సెట్‌కు 938 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు బుధవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 973 మంది విద్యార్థులకు 938 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 160 మందికి గాను 155 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 160 మందికి 150 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 149 మందికి 145 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 150 మందికి 146 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది హాజరు కాగా మధ్యాహ్నం 177 మందికి 171 మంది హాజరయ్యారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 1504 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులకు 1504 మంది హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా రసాయన శాస్త్రం పరీక్షకు 69 మందికి 60 మంది హాజరయ్యారు. ఆర్థిక శాస్త్రం పరీక్షకు 146 మందికి 118 హాజరయ్యారు. పదో తరగతి తెలుగు పరీక్షకు 150 మందికి 125 హాజరయ్యారు.
ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో బుధవారం మాట్లాడుతూ చదువును మధ్యలోనే మానేసిన వారి కోసం దూరవిద్య ద్వారా చదువుకునేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
32 కేసులు నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా బుధవారం మోటారు వాహనాల తనిఖీ అధికారులు 32 కేసులు నమోదు చేసి రూ.1.42 లక్షల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో హెల్మెట్లు ధరించని, లైసెనన్స్ లేని కేసులు ఉన్నాయన్నారు.
టీచర్స్ బదిలీల
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
భీమవరం: యూటీఎఫ్ భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు.

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు