
శ్రీవారి దేవస్థానం చైర్మన్‌కు వినతిపత్రంఅందజేస్తున్న దృశ్యం
జంగారెడ్డిగూడెం రూరల్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాంగం పుస్తకాలను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ ఈ సంవత్సరమంతా రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగాలన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. రూ.41,232 ఆదాయం వచ్చిందని, 1200 మంది స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. మద్ది ఆలయ చైర్మన్ కీసరి సరిత, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, ఎంపీపీ కొదమ జ్యోతి, ఐసీడీఎస్ రీజనల్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల అభివృద్ధికి కృషి చేయండి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల గ్రామ అభివృద్ధికి కృషిచేయాలని కోరుతూ శ్రీవారి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యురాలు పెద్దిరెడ్డి వెంకటకొండ పద్మ, జ్యోతి శ్రీనివాస్ దంపతులు ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావుకు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ద్వారకాతిరుమలలో ప్రధాన రహదారి పక్కన స్ట్రీట్ లైట్లు, వాటికి మినీ మైక్‌లు ఉండేవని, వాటి నుంచి నిత్యం వేద మంత్రోచ్ఛరణలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వచ్చేవన్నారు. దాంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదన్నారు. అయితే రహదారుల విస్తరణ సమయంలో స్ట్రీట్ లైట్లు, మినీ మైక్‌లను తొలగించారని, అప్పటి నుంచి గ్రామంలో చీకట్లు అలముకున్నాయన్నారు.గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, వాటికి మైక్‌లు అమర్చాలని, అలాగే నరసింహ సాగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, పూర్వ వైభవం తేవాలని కోరారు.
ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, భీమవరం : క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌లో జాతీయస్థాయి టెన్నిస్, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి పి.వెంకట రామరాజు అన్నారు. బుధవారం జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు అల్లూరి పద్మరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 1982లో క్లబ్ ఏర్పడిన నాటి నుంచి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పోటీల నిర్వహణకు క్లబ్ సభ్యులతోపాటు వెర్‌టెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేగేశ్న వెంకటరాయ్‌వర్మ, కొంతమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వీవీఎస్‌ఎస్ వర్మ, ఏపీఎస్‌టీపీఏ సెక్రటరీ ఎ.రాంబాబు, కె.రామకృష్ణంరాజు, డీఎస్‌ఎన్ రాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
29న మార్టేరులో కిసాన్ మేళా
ఉండి: ఈ నెల 29న ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మార్టేరులో జరిగే కిసాన్‌మేళా కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొనాలని ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు కోరారు. సుస్థిర వ్యవసాయం, స్థిరమైన ఆదాయం అనే అంశంపై రైతులకు వరిసాగులో పలు మెళకువలు తెలియజేస్తారన్నారు.

పంచాంగం పుస్తకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎలీజా
