
మృతి చెందిన చిన్నారి అన్షు
నూజివీడు: ఈదురుగాలులకు ఆటోపై తాడిచెట్టు కూలిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మర్రిబంధంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సిద్ధార్థనగర్‌కు చెందిన బత్తుల పరిశుద్ధం, బత్తుల జార్జి, మిట్టగూడెంకు చెందిన రాచప్రోలు మాణిక్యం, ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన మారుమూడి చంద్రకాంత, మారుమూడి శ్రావణిలతో పాటు మనవరాలైన 17 నెలల చిన్నారి జిల్లాబత్తుల అన్షును తీసుకుని సీతారామపురంలో అనారోగ్యంతో ఉన్న కోడలు వద్దకు ఆటోలో వెళ్లి తిరిగి నూజివీడు వస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మర్రిబంధం వద్దకు వచ్చేసరికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న తాడిచెట్టు ఒక్కసారిగా వీరి ఆటోపై కూలింది. ఈ ప్రమాదంలో 17 నెలల చిన్నారి అన్షు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమవ్వగా, క్షతగాత్రులందరినీ హుటాహుటిన 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూజివీడు రూరల్ ఎస్సై తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఐదుగురికి గాయాలు

ఆటోపై తాడిచెట్టు కూలడంతో ధ్వంసమైన దృశ్యం