
పీహెచ్‌డీ కేంద్రం సేవలను అందించనున్న ఆకివీడు రైతు భరోసా కేంద్రం
ఆకివీడు: నాణ్యమైన, ఆరోగ్యకర పంటలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పంటలలో తెగుళ్లను పరిశోధించి, వాటి నివారణ (చికిత్స) చర్యలు తీసుకునేలా బృహత్తర కార్యక్రమం తలపెట్టింది. ప్రతి మండలంలో ప్లాంట్ హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్ (పీహెచ్‌డీసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలంలో సొంత భవనం కలిగి, రైతులకు అందుబాటులో ఉండే రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో పీహెచ్‌డీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండే ఆర్బీకేలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మూలకాల లోపాలపై శిక్షణ
ఆయా మండలాల్లోని ప్రధాన పంటలపై వచ్చే తెగుళ్లు, సాంద్రత వంటి వాటిని పరీక్షించేందుకు ఆర్బీకే పరిధిలోని బీఎస్సీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ అర్హత కలిగిన వీఏఏను శిక్షణకు ఎంపిక చేస్తారు. మూడు నెలల పాటు వారికి మూలకాలలో లోపాలు, సాంద్రత పరీక్ష, తెగుళ్ల ఆనవాళ్లను గుర్తించేలా శిక్షణ ఇవ్వనున్నారు. భూమిలో చౌడు శాతం, నీటిలో సెలినిటీ, ఎరువులలో సాంద్రత పరీక్షలపై తర్ఫీదునివ్వనున్నారు. సకాలంలో తెగుళ్లను ఎదుర్కొనే విధంగా, భూమి సాంద్రతను పెంచే విధంగా వీఏఏ తగిన సూచనలు, సలహాలను రైతులకు, వీఏఏలకు తెలియజేస్తారు.
సారవంతమైన నేలలకు కృషి
సారవంతమైన నేలల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలకంటే అధికంగా పచ్చిరొట్ట పెంపకానికి, సేంద్రియ ఎరువుల వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. జిల్లాలో వచ్చే వేసవిలో పచ్చిరొట్ట సాగుకు ముందుగానే 500 క్వింటాళ్ల మినుమ, జీలుగ, పిల్లిపెసర విత్తనాలను అందుబాటులో ఉంచింది. 50 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధం చేసింది. పచ్చిరొట్ట పెంపకంతో భూసారం పెరుగుతుంది. చౌడుబారిన పడనున్న భూములలో సారం పెంచేందుకు పచ్చిరొట్ట సాగు ఎంతగానో ఉపయోగపడుతుంది.
వ్యక్తిగతంగానూ వ్యవసాయ
పనిముట్ల పంపిణీకి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోని రైతులు గ్రూపులుగా ఏర్పడి వ్యవసాయ సామగ్రిని ఇప్పటివరకు పొందుతున్నారు. అయితే రానున్న రోజుల్లో అర్హుడైన ప్రతి రైతుకూ వ్యక్తిగతంగా వ్యవసాయ పనిముట్లు అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గ్రామా ల్లోని ఆర్బీకేలకు శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోనే సొమ్ము జమచేసేలా బడ్జెట్‌లో 55,401.58 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.7,156 కోట్లు కేటాయించడం విశేషం.
నాణ్యమైన, ఆరోగ్యకర పంటలపై ప్రభుత్వం దృష్టి
మండలానికో ప్లాంట్ హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్
రైతులకు అందుబాటులో ఉండే ఆర్బీకేల్లో సేవలు
తెగుళ్ల నుంచి పంటల రక్షణే లక్ష్యం
చీడ పీడల నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ప్రతి మండలంలోని ఒక ఆర్బీకే కేంద్రం వద్ద పీహెచ్‌డీసీని ఏర్పాటు చేసి, దీనిలో బీఎస్సీ, ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ చేసిన వీఏఏను నియమించి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారు. పంటలలో తెగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి సకాలంలో రైతులు నివారణ చర్యలు తీసుకునేలా ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి.
– జెడ్.వెంకటేశ్వర్లు, జేడీఏ, పశ్చిమగోదావరి జిల్లా
