
కార్యక్రమంలో మాట్లాడుతున్న శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి
ఏలూరు (టూటౌన్): జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి కోరారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచినీటి సరఫరా, స్వచ్ఛతపై ఏమైనా సమస్యలు ఎదురైతే పర్మినెంట్ లోక్ అదాలత్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. నీటి సరఫరా, పరిశుభ్రత ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కాలుష్య మండలి ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సంబంధిత అధికారులకు జల కాలుష్య నివారణకు తగు సూచనలు చేస్తున్నామన్నారు. ఫ్యాక్టరీల నుంచి విడుదల చేసే వ్యర్థ పదార్ధాలను శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి మాట్లాడుతూ సమాజంలో విరివిగా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని అలాంటి వాటిపై అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్, మున్సిపల్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు, వాటర్ ఫ్లాంట్ యజమానులు పాల్గొన్నారు.