25న సీఎం జిల్లా పర్యటనపై సమీక్ష

- - Sakshi

దెందులూరు: వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి దెందులూరు మండలం వేదిక కానుంది. ఈ నెల 25 న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెందులూరులో వైఎస్సార్‌ ఆసరా మూడో విడతను దెందులూరులో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలం, వాహనాల పార్కింగ్‌, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను మంగళవారం ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కై కలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఏలూరు రేంజ్‌ డీఐజీ జీ.పాలరాజు, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, జాయింట్‌ కలెక్టర్‌ పీ. అరుణ్‌బాబు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు డైరెక్టర్‌ తొత్తడి వేదకుమారి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం పరిశీలించారు. వేదిక పనులు, హెలీప్యాడ్‌ పనులకు సంబంధించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

మూడు విడతల్లో రూ.19,137 కోట్లు : ఎమ్మెల్యే ఆళ్ళ నాని మాట్లాడుతూ దెందులూరులో ఈ నెల 25న వైఎస్సార్‌ ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మహిళలకు నిధులు విడుదల చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ. 25 వేల కోట్లు రుణమాఫీ ఇస్తానన్న హామీ మేరకు ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేశారన్నారు. ఈ నెల 25న ఇస్తున్న మూడో విడత వైఎస్సార్‌ ఆసరాను కలుపుకుని మూడు విడతలకు 19,137.42 కోట్లు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నో వేల స్వయం సహాయక సంఘాలకు సహకారంగా ఉంటుందన్నారు. మహిళలకు ఆసరాగా ఈ పథకం నిలుస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా మూడో విడత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని దెందులూరులో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా దెందులూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. నియోజకవర్గం నుంచి సుమారు 60 వేల మంది హాజరవుతారని, తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ ఆసరా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని దెందులూరులో నిర్వహించడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించడం ఎన్నటికీ మరువలేమని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

దెందులూరు: ముఖ్యమంత్రి దెందులూరు పర్యటనకు అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కోరారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, వీఆర్‌ ఎలీజా, తలారి వెంకట్రావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసు బాబులతో కలిసి సభా స్థలం, హెలీప్యాడ్‌ పరిశీలించారు. 24నాటికి అన్ని పనులు పూర్తి కావాలని కోరారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25 వరకు జిల్లా అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ పీ.అరుణ్‌బాబు మాట్లాడుతూ హెలీప్యాడ్‌ ఏర్పాట్లు, బారికేడ్లు, సభా స్థలం చేరుకునే వరకు ఇరుపక్కల ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు పకడ్బందీగా ఉండాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజీంద్రన్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారన్నారు. దెందులూరులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో ఏర్పాట్లు, ఉద్యోగుల సమన్వయ బాధ్యతలపై సమీక్షించారు.

వైఎస్సార్‌ ఆసరా మూడో విడత ప్రారంభోత్సవం

78.76 లక్షల మంది మహిళలకు రూ.6379 కోట్ల విడుదల

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top