హామీలు అమలు చేస్తున్నా.. దుష్ప్రచారం

- - Sakshi

ఏలూరు (మెట్రో): ఉద్యోగుల రక్షణే ధ్యేయంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకనుగుణంగా ఒక్కొక్కటి నెరవేర్చుతుంది. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చి వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల ఏడో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలతో ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటల్ని ఒక్కొక్కటి అమలు చేస్తోంది.

ఇప్పటికే రూ. 1200 కోట్ల చెల్లింపు

రాష్ట్ర ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీను, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి సమక్షంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, జీపీఎఫ్‌, జీఎల్‌ఐ, మెడికల్‌ బిల్స్‌, ఉద్యోగ విరమణ చేసినవారికి గ్రాట్యుటీ, పోలీసులకు టీఏ బిల్లులు ఇలా వివిధ రకాల బకాయిల నిమిత్తం రూ.7 వేల కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాయకులకు తెలిపింది. ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీలో నిర్ణయించి దశలవారీగా గత పది రోజుల్లో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తూనే ఉంది. ఈ నెల 31 నాటికి రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా చెల్లించింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుతున్న మేరకు ఈ నెల ఒకటినే జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అదే విధంగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేసింది.

ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ఇలా ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు మాత్రం వారిని రెచ్చగొట్టేందుకు వివిధ రకాల ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానమైన ఉద్యోగ సంఘాలైన ఏపీ ఎన్‌జీవో, ఏపీ జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌తో పాటు కీలకమైన రెవెన్యూ శాఖలో వీఆర్‌ఓల అసోసియేషన్‌ సైతం ఉద్యమానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించకుంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని, అప్పుడు ఆందోళన బాట పడతామని ఉద్యోగ సంఘాలు నేతలు నిర్ణయించినప్పటికీ కొందరు ఉద్యోగులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ధర్నాలు, విధుల బహిష్కరణ, ఆందోళనలు అంటూ అనేక గందరగోళాలు సృష్టిస్తున్నారు. నేరుగా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు ఉద్యమంలో పాల్గొనేదే లేదని, ఉద్యమానికి, తమకు ఎటువంటి సంబంధం లేదని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ కొందరు కావాలని ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఆందోళనలు చేయడం ఒకింత గందరగోళానికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 45 వేల మంది ఉద్యోగులుండగా, కేవలం 2 వేల లోపు ఉద్యోగులు మాత్రమే ఆందోళనలో పాల్గొంటున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు

విడతలవారీగా హామీల అమలు

కొందరు ఉద్యోగ సంఘ నేతలు రెచ్చగొట్టే యత్నం

జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది ఉద్యమానికి దూరం

స్వార్థ ప్రయోజనాల కోసమే ఆందోళన

కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళనలు, ఉద్యమాల పేరుతో ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై నమ్మకంతో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఉద్యమాలకు, వివిధ రకాల ఆందోళనలకు దూరంగా ఉంటోంది.

– భూపతిరాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు

ఇచ్చిన మాట ప్రకారం చెల్లింపులు

రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేస్తోంది. రూ.3 వేల కోట్లకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వివిధ రకాల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చకుంటే ఆందోళన చేసేందుకు వెనకడుగు వేయం. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం చర్యలు తీసుకుంటోంది.

– చోడగిరి శ్రీనివాస్‌, ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top