ఆగిరిపల్లి: అదృశ్యమైన బీటెక్ విద్యార్థి ఆచూకీ లభ్యమైనట్లు ఎస్‌ఐ ఎన్.చంటిబాబు మంగళవారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కైకలూరుకు చెందిన పువ్వుల మణిశంకర్ (21) మండల పరిధిలోని పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగు కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి కనబడక పోవడంతో తోటి విద్యార్థులు విద్యార్థి తండ్రికి సమాచారం అందించారు. దీనిపై తండ్రి రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పోలీసులు రెండు బృందాలుగా గాలించారు. విద్యార్థి మచిలీపట్నంలో ఉన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. అనంతరం విద్యార్థికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అప్పగించారు.
6 కాసుల బంగారం చోరీ
పెదవేగి: తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఆరు కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. పెదవేగి ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయరాయికి చెందిన పిట్టా పెంటయ్య మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈనెల 20న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి రెండు బంగారు చైన్‌లు, రెండు ఉంగరాలు, ఒక బ్రాస్‌లెట్, రెండు వాచ్‌లు మొత్తం ఆరు కాసుల బంగారం దొంగిలించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.