
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్‌ను కలిసిన తూర్పు కాపు సంఘ నాయకులు
ఏలూరు (టూటౌన్): ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. 2023–24కు సంబంధించి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి ఎంవీ నారాయణరాజు తెలిపారు. అధ్యక్ష పదవికి అబ్బినేని విజయకుమార్, చల్లా రాజేంద్రప్రసాద్, జగ్గవరపు సురేష్‌కుమార్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి పి.దుర్గాప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఏకగ్రీవం కానున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి నక్క మదన్మోహన్ నాగరాజు, మల్లెల గోపాలకృష్ణ, కోశాధికారి పదవికి పి.నాగేంద్రపాల్, గొర్రెల సతీష్ పోటీలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి పదవికి నోముల రాముడు ఒక్కరే నామినేషన్ వేయగా ఆయన ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. గ్రంథాలయ కార్యదర్శి పదవికి గుత్తా రోహిణి, జి.విజయభాస్కర్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి పదవికి పి.జాన్సన్, టి.సుబ్బారావు నామినేషన్లు వేశారు. మహిళా ప్రతినిధి పదవికి ఎ.విజయకుమారి ఏకగ్రీవం కానున్నారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఉన్నవారి వివరాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, భీమవరం : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తుర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్‌కు తూర్పుకాపు సంఘం నాయకులు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తూర్పు కాపులు ఉపాధి నిమిత్తం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారని, అయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉంటున్న వారికి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. వీరి మాదిరిగానే మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు కూడా ఓబీసీ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు. రాష్ట్ర కమిటీ తరఫున జీవీఎల్‌కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు కాపు సంఘ నాయకులు ఈజ్జవరపు మరిడయ్య, మజ్జి రాంబాబు, కొత్తకోటి ప్రసాద్, మెరగని ప్రసాద్, వాంజరపు దేవి ప్రసాద్, చేనమల గంగాధర్, చేనమల చంద్రశేఖర్, గొర్లి శ్రీనువాసనాయుడు, సరిపిడకల రామారావు, కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల వినతి
ఏలూరు (టూటౌన్): విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ నాయకులు సోమవారం కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గ్రూప్–4, క్లాస్–4 ఉద్యోగాల భర్తీకి గడువు నెలాఖరుతో ముగియనుందని, అయితే సహాయ సంచాలకులు అన్ని శాఖల నుంచి రోస్టర్స్ తెప్పించి నామమాత్రంగానే తనిఖీ చేయడంతో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి కొత్త ఉద్యోగాలు గుర్తించటం జరగలేదని అన్నారు. అలాగే పలు సమస్యలను కలెక్టర్‌కు వివరిస్తూ న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు జడీవీఎస్ వీరభద్రరావు, బి.గిడియన్, జిల్లా కోశాధికారి పి.దేవరాజు ఉన్నారు.
రేపు అమర జవాన్ ఐకాన్ ఆవిష్కరణ
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా మాజీ సైనికోద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు అమర్ జవాన్ ఐకాన్ (స్థూపం) కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరిస్తారని జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీబీ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇద్దరు ఆర్మీ జనరల్స్ పాల్గొంటారని పేర్కొన్నారు.

కోర్టు ఆవరణలో న్యాయవాదులు