
మే 4న జాతీయస్థాయి వైద్య విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహణ
రెండు గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
మధ్యాహ్నం 1.30 వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
ఈనెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు విడుదల
మే ఒకటిన ఎన్‌టీఏ సైట్‌లో అడ్మిట్‌కార్డులు
విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై ఆంక్షలు
పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లతో విద్యార్థుల తనిఖీలకు ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 65వేల మందికి పైగా విద్యార్థుల దరఖాస్తు
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 4న జరగనున్న జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌తోపాటు వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో జరుగుతుండగా, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికై దేశ వ్యాప్తంగా రాత పరీక్ష (ఆఫ్‌లైన్) ద్వారా నిర్వహిస్తున్న ఒకే ఒక్క పరీక్ష నీట్ కావడం విశేషం.
మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థినీ మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా మధ్యాహ్నం 1.30 తరువాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌తో పాటు అడ్మిట్‌కార్డులో పొందుపరచిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంది.
65 వేలమందికి పైగా దరఖాస్తు
నీట్ యూజీకి గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 64,929 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుత ఏడాది 65 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు.
ఈనెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు
నీట్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ జిల్లాలో ఎక్కడ పరీక్షా కేంద్రాన్ని కేటాయించారనే సమాచారంతో ఈనెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలను ఎన్‌టీఏ అధికారిక సైట్‌లో పొందుపరచనుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా పరీక్షకు హాజరు కానున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.
విద్యార్థులకు తమ సొంత ఊరు, జిల్లాలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేని పక్షంలో ఇతర జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలను కేటాయించే అవకాశాలున్నాయి. మే ఒకటిన ఎన్‌టీఏ సైట్‌లో అడ్మిట్‌కార్డులు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఎన్‌టీఏ సైట్ నుంచి అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారం పరీక్షకు హాజరు కావాలి.
వస్త్రధారణపై ఆంక్షలు
⇒ విద్యార్థులు జీన్స్ ఫ్యాంట్లు వంటి వ్రస్తాలను ధరించకుండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్‌గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు.
⇒ చేతికి స్మార్ట్‌వాచీతో పాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని రూమ్‌లలో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు.
⇒ బ్లూటూత్ వాచీలు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఎన్‌టీఏ నిబంధనలను తూచా తప్పకుండా పాటించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
నీట్ జరిగేది ఇలా..
⇒ పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ఒక్కొక్కరిగా లోపలికి పంపుతారు. మధ్యాహ్నం 1.30 వరకు అనుమతించిన తరువాత పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేస్తారు.
⇒పరీక్షా కేంద్రాల్లోకి వచ్చిన విద్యార్థులను మధ్యాహ్నం 1.15 గంటల నుంచి కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారు.
⇒ మధ్యాహ్నం 1.30 నుంచి ఇన్విజిలేటర్లు విద్యార్థుల అడ్మిట్‌కార్డులను తనిఖీ చేసి, పరీక్ష రాసేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలను తెలియజేస్తారు. తదుపరి మధ్యాహ్నం 2.00 గంటలకు కచ్చితంగా పరీక్షను ప్రారంభిస్తారు. విద్యార్థులను పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు.
విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి
విద్యార్థులు అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్‌తో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్‌పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. దీంతో పాటు పోస్ట్‌కార్డ్ సైజు వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్‌కార్డుతో పాటు డౌన్‌లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని నియమావళిలో పొందుపరిచారు.
ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు.