
మహోద్రిక్త ప్రచార ఆర్భాటంతో సాగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాలుగో దశ రక్తసిక్త మయింది. కూచ్‌బెహార్ జిల్లా సీతాల్‌కుచీ నియోజకవర్గం జోర్‌పట్కిలో శనివారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్) జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అదే నియోజకవర్గంలో మరోచోట గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ఆ రాష్ట్రం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల వాగ్యుద్ధాలతో వేడెక్కింది. అటు తర్వాత అది మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల కోసం అసా ధారణ రీతిలో 77,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని, 35,000 మంది రాష్ట్ర పోలీసులను నియమించారు. ఎనిమిది దశల పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. బలగాలు తమంత తాము శాంతిని నెలకొల్పలేవు.
ఆయుధాలతో సర్వసన్నద్ధంగా వున్న బలగాల ఉనికిని చూసి హింసకు పాల్ప డదల్చుకున్న, అరాచకాన్ని సృష్టించదల్చుకున్న శక్తులు వెనకడుగేస్తాయని, ఫలితంగా ప్రశాంతత నెలకొంటుందని అందరూ అనుకుంటారు. కానీ నాయకులు తమ పరిమితులేమిటో, తమ బాధ్యత లేమిటో గుర్తించనప్పుడు అరాచక శక్తులు సహజంగానే చెలరేగుతాయి. భద్రతా బలగాలను సైతం బేఖాతరు చేస్తాయి. ఆ రాష్ట్రంలో జరిగింది అదే. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి భయోత్పాతం సృష్టించటం, ప్రత్యర్థి పక్షాల నాయకులపై దాడులు వగైరాలు షరా మామూలుగా సాగాయి. తాను పోటీ చేసే నందిగ్రామ్‌లో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే రంగంలోకి దిగి రెండు గంటలు కూర్చున్నారు. ఈమధ్యే బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి జరిగింది. వీటన్నిటికీ పరాకాష్టగా ఇప్పుడు పోలీసు కాల్పులు కూడా జరిగాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింస కొత్తగాదు. టీఎన్ శేషన్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నివ్వటంతో అనంతరకాలంలో వచ్చిన ఎన్నికల చీఫ్‌లు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవటం మొదలుపెట్టారు. దాంతో చాలాచోట్ల హింసాయుత వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. బెంగాల్‌లో కూడా గతంతో పోలిస్తే ఎంతో కొంత నయం. అయితే అది ఆశిం చిన స్థాయిలో లేదు. కనుక భారీయెత్తున కేంద్ర బలగాలను మోహరించటం మంచిదేనన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. కానీ సీతాల్‌కుచీలో కాల్పులు జరపక తప్పనంత స్థాయిలో అల్లర్లు ఏం జరిగాయో సీఐఎస్‌ఎఫ్ ఇస్తున్న వివరణ ద్వారా తెలియడం లేదు. స్థానికులు కొందరు తమపై రాళ్లు, కర్రలతో దాడిచేశారని, తమ వాహనాన్ని ధ్వంసం చేశారని సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధి చెబుతున్నారు. అందుకే కాల్పులు జరపాల్సివచ్చిందంటున్నారు. దాడిలో జవాన్లు ఎవరూ గాయ పడిన దాఖలా లేదు. నిబంధనల ప్రకారం హింసకు దిగిన మూకను అదుపు చేసేందుకు లాఠీచార్జి, బాష్పవాయు గోళాల ప్రయోగం వగైరా చర్యలన్నీ నిష్ఫలం అయ్యాకే కాల్పులు జరుపుతారు. అవి సక్రమంగానే అమలయ్యాయా? ఎందుకంటే సీఐఎస్‌ఎఫ్ బలగాలకు అల్లరి మూకలను నియంత్రిం చటంలో పెద్దగా అనుభవం లేదు. దేశంలో ఎక్కడ ఎలాంటి సమస్యలెదురైనా సీఆర్‌పీఎఫ్ బలగాలనే వినియోగిస్తారు.
శాంతిభద్రతల పరిరక్షణలో, అల్లరి మూకలను నియంత్రించటంలో ఆ దళానికి అపారమైన అనుభవముంది. ఇందుకు భిన్నంగా సీఐఎస్‌ఎఫ్‌ను పరిశ్రమల పరిరక్షణకూ, విమానాశ్రయాల భద్రతకూ అధికంగా వినియోగిస్తారు. సాధారణ ఓటర్లు నిర్భయంగా ఓటేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాల్సిందే. కానీ ఆ పేరున అతిగా స్పందించే ధోరణి ప్రమాదకరం. కాల్పులకు దారితీసిన ఉదంతంలో సీఐఎస్‌ఎఫ్ ఇస్తున్న సంజాయిషీకీ, స్థానికుల కథనానికీ పొంతన లేదు. పోలింగ్ కేంద్రానికి సమీపాన ఒక బాలుడు అస్వస్థతలో వుండటాన్ని గమనించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పొరబడి దాడికి దిగారని సీఐఎస్‌ఎఫ్ జవాన్లు చెబుతున్నారు. కానీ వారు తనను తీవ్రంగా కొట్టడం వల్ల రోదిస్తుండగా స్థానికులు అక్కడ గుమిగూడారని బాలుడు అంటున్నాడు. ఈ ఉదంతంలో భాషాపరమైన సమస్య కూడా వున్నట్టుంది. వారు హిందీలో అడిగే ప్రశ్నలకు అతను తడబడటం, దాంతో జవాన్లకు అనుమానం వచ్చి కొట్టడం పర్యవసానంగా ఉద్రిక్తతలు ఏర్పడి కాల్పుల ఘటనకు దారితీసిందని మీడియా కథనాల ద్వారా అర్థమవుతోంది.
కనీసం ఈ ఉదంతం తర్వాతైనా పార్టీలు బాధ్యతగా మెలగలేదు. సంయమనాన్ని ప్రదర్శించ లేదు. ‘ఇదివరకు మాదిరి ఇష్టానుసారం రెచ్చిపోతే కేంద్ర బలగాలు చూస్తూ వూరు కోవు... ప్రతి చోటా సీతాల్‌కుచీలు పునరావృతమవుతాయి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హెచ్చ రించారు. ఇటు టీఎంసీ సైతం అదే స్థాయిలో ప్రతి దాడికి దిగుతోంది. సీతాల్‌కుచీ కాల్పులకు ఎన్ని కల సంఘం నిర్వాకమే కారణమంటోంది. బెంగాలీలకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసునని హెచ్చరిస్తోంది. పార్టీలు వివిధ అంశాలపై తమ వైఖరేమిటో, అవతలి పక్షం అవగాహనలోని లోపాలే మిటో చెప్పడం ఒకప్పుడు ఎన్నికల సమయాల్లో కనబడేది. ప్రజలు అన్నివిధాలా ఆలోచించి ఓటేసే అవకాశం వుండేది. కానీ ఇప్పుడు ఎన్నికలు ధనశక్తికి, కండబలానికి ప్రతీకగా మారుతున్నాయి. సమ స్యల ప్రస్తావన బదులు దుర్భాషలూ, దౌర్జన్యాలూ నిత్యకృత్యమవుతున్నాయి. ఇవి అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము అన డంలో సందేహం లేదు. కనుక ఎన్నికల సంఘం మరింత జాగురూకతతో మెలగాల్సి వుంటుంది.