ప్రజారోగ్యానికి పందిరి కట్టాలి

Sakshi Editorial On Public Health

ఏడాది కాలంగా మీడియా కోడై కూస్తున్న... వైద్యపరమైన ఒక మాటేదైనా ఉందంటే, అది ‘ప్రజారోగ్యం’! దేశంలో ప్రజారోగ్యాన్ని వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఫలితం ఎంత ఘోరమో కరోనా మనకు విడమర్చింది. ఇప్పుడదే మాటను, పాలకులు ఎజెండాలోకి తీసుకునేలా చేసింది. కోవిడ్‌ బారినపడి లెక్కకు మిక్కిలి జనాలు మృత్యు వాతపడుతుంటే,  వైద్యం కోసం లక్షల రూపాయలు ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి వస్తే... జబ్బొచ్చిన వాళ్లే కాదు, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ప్రతి కుటుంబం జడుసుకుంది. అవి తలచుకొని, ‘ఏమో! పొరపాటున మన ఇంట్లోనే ఎవరికైనా కరోనా వస్తే?’ అని గగుర్పాటు చెందింది. పేద, అల్ప, మధ్యాదాయ వర్గాలే కాకుండా ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు కూడా కరోనా చికిత్స ఖర్చులు భరించలేక అల్లాడు తున్నాయి. ఆస్తులు అమ్మి అంతంత చెల్లించినా, కడకు ఇంటి పెద్దదిక్కు దక్కక బావురు మన్న కుటుంబాలెన్నో! పెద్ద వయసువారే కాక కోవిడ్‌ రెండో అలకొట్టి చిన్న, మధ్య వయస్కులూ పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో ఒక దశ, 24 రోజుల స్వల్పకాలంలో లక్షమందిని కోల్పోయాం. ‘సకాలంలో వైద్యం దొరికి ఉంటే’, ‘ముందుగానే ప్రాణాంతక జబ్బులు లేకుండా ఉండుంటే’, ‘ఈ పాటికే రెండు డోసుల టీకామందు పడి ఉంటే...!’ ఇలా ప్రతికూల అంశాల్ని తలచుకొని వగచిన కుటుంబాలెన్నెన్నో! గ్రామీణ భారతంలో వైద్యం మృగ్యం! ప్రతిచిన్న అవసరానికి పట్టణాలకు, నగ రాలకు పరుగెత్తాల్సిన స్థితి తెచ్చిపెట్టాం. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవద్ద’ని ఉగ్గుపాల నాడే నేర్పిన సంస్కృతి, పాలకుల తప్పుడు ప్రాధాన్యతలతో పెడదారి పట్టింది. స్వతంత్రం వచ్చాక దశాబ్దాలు గడచినా వైద్యారోగ్యానికి తగిన బడ్జెట్‌ కేటాయించక, ముందస్తు ప్రణాళికలు లేక ప్రజా రోగ్యం కుంటుబడింది. వైద్యాన్ని ఫక్తు వ్యాపారం చేసి, కోట్లు గడిస్తున్న కార్పొరేట్‌ వైద్య రంగం ఇష్టారాజ్యమైంది. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసి, మనకొక ఏడాది సమయం ఇచ్చినా... తగినంత ఆక్సిజన్‌ సమకూర్చుకోలేని, ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి! ‘ఆపరేషన్‌ సముద్ర సేతు–2’ పేరిట, భారత నౌకా దళానికి చెందిన ఏడు యుద్ధనౌకల్ని, ప్రపంచ పటంలో ఇసుక రేణువంత ఉండే చిన్న దేశాలకు పంపి ఆక్సిజన్‌ తెప్పించుకున్న దుస్థితి మనది!

కరోనా కష్టకాలంలో ఎదురైన పరిస్థితులు ప్రభుత్వాలపై వైద్యారోగ్యపరమైన ఒత్తిడి పెంచు తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఒక గుణపాఠంగా నేర్పుతోంది కరోనా! దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నవతరం యువనాయకులు చొరవ తీసుకొని ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసే చర్యలు కరోనా రాక ముందే చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అందుకో ఉదాహరణ! మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇప్పుడిప్పుడే కదలిక మొదలైంది. ఇదొక మంచి పరిణామం! తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రంలోనూ విస్తృత స్థాయిలో ప్రభుత్వ వైద్య పరీక్షా (డయాగ్నోస్టిక్‌) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 19 జిల్లా కేంద్రాల్లో బుధవారమే ప్రారంభమ య్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరులందరి ఆరోగ్యనివేదికలు (హెల్త్‌ ప్రొఫైల్స్‌) రూపొందించాలనీ నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ కేంద్రం, రక్తనిధి, ఎముకల–నరాల ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి... ఇలా పలు కీలక నిర్ణయాలే తీసుకు న్నారు. వచ్చే రెండేళ్లలో పదివేల కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చించాలనేది సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం ఏపీలో 10,032 వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు, ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్‌ అర్హతలు కలిగిన ఒక మాధ్యమిక ఆరోగ్య ప్రధాత, ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రా(పీహెచ్‌సీ)ల ఏర్పాటు వంటివన్నీ ప్రగతిశీల చర్యలే! మండలానికి ఒక 104, ఒక 108 అంబులెన్స్‌ కల్పించడం, 104 వాహనంలో ప్రతి పల్లెకూ నెలకోసారి వెళ్లి 14 రకాల నిర్ధారణ పరీక్షలు జరిపి, దీర్ఘకాలిక జబ్బులకు మందులిస్తున్నారు. బాధితుల ఆరోగ్య నివేదిక రూపొందించి, దాన్ని పీహెచ్‌సీలకు అనుసంధానపరిచారు. ‘క్యూఆర్‌’ కోడ్‌ ఉండే హెల్త్‌కార్డ్‌లో పొందుపరుస్తూ, రోగులకు ‘ప్రత్యేక వైద్యసేవ’ల కోసం ప్రతి బోధనాసుపత్రిలో ఇ–సంజీవని హబ్స్‌ని అందుబాటు లోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి సేవలందించడం దేశంలోనే రికార్డు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, ఐటీడీఏ ప్రాంతాల్లో 5 స్పెషాలిటీ ఆస్పత్రులు, 3 ప్రాంతాల్లో పిల్లల ఆస్పత్రులు అదనంగా రానున్నాయి. ఏ జబ్బొచ్చినా పేదలకు భరోసా ఇచ్చేలా 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ జబ్బులనూ ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రైవేటు వైద్యమాఫియా నుంచి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మహారోగాల నుంచి బిడ్డల్ని కాపాడుకున్నట్టే! ఎందు కంటే, స్వార్థంతో వైద్యాన్ని అంగడి సరుకు చేసి, ఆర్థికంగా బలోపేతమైన వ్యవస్థ ప్రైవేటు వైద్య రంగం. అంగబలం, అర్థబలంతో ఊడలు నేలలోకి దిగిన మర్రి చందమే! ఎంతకైనా తెగించగలదు. ప్రజారోగ్య వ్యవస్థలు ఇదివరకు లేనివి కావు! వాటిని నిర్వీర్యం చేసి, శకాలపై బంగళాలుగా ఎదిగిన విషసంస్కృతి కార్పొరేట్‌ వైద్య వ్యవస్థది. జనహితంలో ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వాలు తమ నిఘా, నిర్వహణ యంత్రాంగంతో నిరంతరం కాపెట్టుకొని ఉండాలి. ప్రజారోగ్య వ్యవస్థని, తద్వారా ప్రజారోగ్యాన్ని, అంతిమంగా ప్రజల్ని కాపాడుకోవాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top