పెళ్లి వయసు పెంచడమే ఉత్తమం | Sakshi Editorial On Minimum Age Of Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి వయసు పెంచడమే ఉత్తమం

Aug 29 2020 1:44 AM | Updated on Aug 29 2020 1:44 AM

Sakshi Editorial On Minimum Age Of Marriage

దేశంలో ప్రసూతి మరణాల రేటు తగ్గించడం కోసం ఆడపిల్లల వివాహ వయసు పెంచే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మొన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించిన నాటి నుంచీ దానిపై మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవానికి కేంద్రంలోనే స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకూ, ఆరోగ్యమంత్రిత్వ శాఖకూ మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నట్టు కథనాలొచ్చాయి. సుప్రీంకోర్టు ఒక కేసు సందర్భంగా 2017లో చేసిన సూచన ఈ ప్రతిపాదనకు మూలం. వివాహ వయస్సు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో కేంద్రానికి సూచించింది. మన దేశంలో ప్రస్తుతం యువతుల వివాహ వయసు 18 ఏళ్లుకాగా, యువకులకు అది 21 ఏళ్లు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు కేంద్రం యువకుల వివాహ వయసును కూడా 18 ఏళ్లకు తగ్గిద్దామన్న యోచన చేసింది. లా కమిష¯Œ  దీనివైపే మొగ్గు చూపింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఇద్దరి వివాహ వయసూ సమం చేస్తే మంచిదని అభిప్రాయపడింది. మొత్తానికి ఈ ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశంలో ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్‌) ఎక్కువగా వుండటానికి కారణం ఆడపిల్లకు 18 ఏళ్లకే పెళ్లవడం వల్లనేనని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ ప్రస్తావన కూడా వుంది. ప్రతి లక్ష జననాలకూ ఎంఎంఆర్‌ 70కంటే తక్కువుండాలని ఆ లక్ష్యాలు సూచిస్తున్నాయి. 2017నాటి జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం మన దేశంలో 2020నాటికి ఆ రేటు కనీసం 100కు పరిమితం కావాలి. కానీ కమిషన్‌ లక్ష్యాన్ని ఇంతవరకూ సాధించిన రాష్ట్రాల సంఖ్య కేవలం 11 మాత్రమే. ఈ కారణాలన్నిటివల్లా యువకుల వివాహ వయసు కుదించేకంటే ఆడపిల్లల వివాహ వయసునే పెంచితే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత బడ్జెట్‌ సమా వేశాల్లో సమతా పార్టీ మాజీ నాయకురాలు జయా జైట్లీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని నియ మించారు. వాస్తవానికి ఆ కమిటీ ఇంకా తన నివేదిక అందజేయాల్సివుంది. అది అందాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని మోదీ అన్నారు గనుక వచ్చే నెలలో ప్రారంభం కాబోయే వర్షాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టకపోవచ్చు.

రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఆడపిల్లల పెళ్లి వయసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వేర్వేరు కారణాలున్నాయి. ఆడపిల్లల్లో చదువుకునేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది కనుక వారి వివాహ వయసు పెంచడం అవసరమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వాదించింది. డిగ్రీలో చేరేనాటికి వారిని పెళ్లి పేరుతో కట్టిపడేసే తీరువల్ల ఆడపిల్లల చదువు కుంటుపడుతోందని, అనేకులు పూర్తిగా చదువు మానేస్తున్నారని ఆ శాఖ వివరించింది. పైగా మగపిల్లల వయసును 18 ఏళ్లకు తీసుకురావడంవల్ల జనాభా నియంత్రణ ఆశయం కుంటుపడుతుందని హెచ్చరించింది. కానీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వాదన మరోలా వుంది. ఆడపిల్లలు 21 ఏళ్ల వయసులోపే లైంగికంగా చురుగ్గా వుంటారని, వివాహ వయసు పెంచితే వారిలో అనేకులు పునరుత్పత్తి ఆరోగ్య రక్షణ వినియోగించుకోవడంలో లేదా లైంగికహక్కుల రక్షణ విషయంలో వెనకబడతారని హెచ్చరించింది. అలాగే ఈ సవరణ వల్ల చాటుమాటుగా బాల్య వివాహాలు పెరిగే అవకాశం వుందని తెలిపింది. ఈ మాదిరి వివాహాన్ని భాగస్వాముల్లో ఎవరో ఒకరు సవాలు చేస్తేనే అది రద్దవుతుందని గుర్తుచేసింది. దీనికి పరిష్కారంగా ఫిర్యాదుతో పనిలేకుండా బాల్యవివాహం దానంతటదే చెల్లుబాటు కాదని నిర్దేశించేలా చట్టాన్ని సవరిస్తే సరిపోతుందని కేంద్రం అనుకుంది.

ఆరోగ్య రంగ నిపుణులైతే  20 ఏళ్లు దాటాకే ఆడపిల్ల శరీరం గర్భధారణకు అన్నివిధాలా అనువుగా వుంటుందని చెబుతున్నారు. అలాగే పద్దెనిమిదేళ్లకే పెళ్లవడం వల్ల ఆడపిల్లపై సామాజికంగా, కుటుంబీకంగా ఒత్తిళ్లు మొదలవుతాయని, ఆ సమయంలో గర్భం ధరించడం వల్ల ఆమె ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుందని, మన దేశంలో ఎంఎంఆర్‌ అధికంగా వుండటానికి కారణం ఇదేనని వారు చెబుతున్న మాట. చట్టాలేమంటున్నాయి... కేంద్ర మంత్రిత్వ శాఖలు కారణాలు ఏం చెబుతున్నాయన్న సంగతలా వుంచితే ఆడపిల్ల ఇష్టాయిష్టాలను గమనించి మంచి చదువు చదివించడం, ఆమె విద్యాధికు రాలయ్యేలా ప్రోత్సహించడం నాగరిక లక్షణం. మన దేశంలో 171 ఏళ్ల క్రితమే మహారాష్ట్రకు చెందిన సంఘసంస్కర్తలు జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయ్‌ ఫూలే దంపతులు ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చదివించాలన్న చైతన్యం కలిగించేందుకు ఉద్యమించారు. కానీ విషాద మేమంటే ఈనాటికీ అది సాకారం కాలేదు.

విద్యాహక్కు చట్టం వచ్చి దశాబ్దం దాటుతున్నా ఆడ పిల్లల్ని చదివించడానికి కుటుంబాలు సంసిద్ధం కావడం లేదు. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో అక్షరాస్యత 64.8 శాతం అయితే, మగపిల్లల్లో అది 75.3 శాతంగా వుంది. కానీ ఆడపిల్లల్లో కేవలం 53.7 శాతం మాత్రమే. ఇంత వ్యత్యాసం వుండటం ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఆడపిల్లల్ని చదివించడం వల్ల 2025 నాటికి జీడీపీ గణనీయంగా పెరుగుతుందని 2018 నాటి మెకెన్సీ నివేదిక తెలిపింది. కనుక ఆడపిల్లల్ని చదివించే సంస్కృతి మరింత పెరగాల్సిన అవసరం వుంది. నూతన విద్యావిధానం ప్రకారం చూసినా డిగ్రీ విద్య నాలుగేళ్లకు హెచ్చింది. కనుక ఆడపిల్లల వివాహ వయసు పెంచడం ఏవిధంగా చూసినా మంచిదే. కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యలకు అదొక్కటే పరిష్కారం కాదు. ఆడపిల్లలకు సరైన పోషకాహారం అందేలా, వారి విద్యకు ఆర్థికంగా తోడ్పడేలా, ప్రతి విద్యాసంస్థలోనూ మెరుగైన టాయిలెట్లు వుండేలా ప్రభుత్వాలు చూస్తేనే ఆడ పిల్లలు బాగా చదువుకోవడానికి, అన్ని రంగాల్లో వారు ముందంజలో వుండటానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ఎదగడానికి అవకాశం వుంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలు దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం కావాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement