మన పాపం! ప్రకృతి శాపం!!

Sakshi Editorial On IPCC Report Warns Of Unavoidable Multiple Climate Hazards

కొరడాతో కొట్టినట్టు చెబితే కానీ కొన్ని విషయాల తీవ్రత అర్థం కాకపోవచ్చు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) బృందం తాజా నివేదిక సోమవారం వెల్లడించిన అంశాలు పరిస్థితి తీవ్రత తెలిపాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అగత్యాన్ని మరోసారి గుర్తుచేశాయి. ప్రపంచ మానవాళిలో 40 శాతం మంది, అంటే సుమారు 350 కోట్ల మంది డేంజర్‌ జోన్‌లో జీవిస్తున్నారనీ, మన పర్యావరణ వ్యవస్థల్లో అనేకం సరిదిద్దడానికి వీలు లేనంతగా ఇప్పటికే పాడయ్యాయనీ ఐపీసీసీ చెప్పినమాట ప్రపంచ దేశాలు కచ్చితంగా కలవరపడాల్సిన విషయం. 

67 దేశాలకు చెందిన 270 మంది శాస్త్రవేత్తలు కలసి రూపొందించగా, 195 ప్రభుత్వాలు ఆమోదించిన కీలక నివేదిక ఇది. వాతావరణంలోని మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా మొక్కలతో సహా ఈ భూగోళం మీది సమస్త ప్రాణికోటికీ ముప్పు ముంచుకొస్తోందని ఈ నివేదిక సారాంశం. వడగాలులు, కరవులు, వరదల లాంటి పర్యావరణ ప్రమాదాలు మరింత పెరగవచ్చట. ఆఫ్రికా, ఆసియా, మధ్య – దక్షిణ అమెరికా సహా అనేక ప్రాంతాల్లో ఆహారం, నీటికి ఇబ్బందులు తలెత్తవ చ్చట. ఇక, మన దేశంలోనూ మరికొన్నేళ్ళలోనే అనేక ప్రాంతాలు ఎంతటి దుర్భర నివాసాలుగా తయారవుతాయన్నది వింటే నిష్ఠురంగా అనిపించవచ్చు. కానీ, నిజాలు గ్రహించి, నిద్ర నుంచి మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. అహ్మదాబాద్‌ ఓ ఉష్ణ ద్వీపమైతే, సముద్ర మట్టం పెరిగి ముంబయ్‌ వరద బాధిత నగరమవుతుంది. చెన్నై, భువనేశ్వర్, పాట్నా, లక్నో లాంటి నగరాలు ఉక్కపోతకు నిలయాలవుతాయని ఐపీసీసీ పారాహుషార్‌ చెబుతోంది. 

మానవాళి అందరికీ ఏకైక నివాసమైన ఈ భూగోళం పట్ల బాధ్యతను అగ్రరాజ్యాలు విస్మరిస్తు న్నాయి. ఆదర్శంగా ముందుండి నడపడం మానేసి, పెద్దయెత్తున కాలుష్యానికి కారణమవుతున్న ప్రపంచ శక్తులన్నీ ఇందులో ‘నేరస్థులే’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. కటు వుగా తోచినా, అది అక్షరసత్యం. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మహా అయితే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మించకుండా చూడాలనేది ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం. కానీ, అసలంటూ భూతాపంలో పెరుగుదలే సురక్షితం కాదని ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది. లక్ష్యంగా పెట్టుకు న్నట్టు 1.5 డిగ్రీల పెంపునకే కట్టడి చేయగలిగినా సరే, ఈ పుడమి మీది జీవజాతుల్లో దాదాపు 14 శాతం అంతరించిపోయే ప్రమాదం ఉందట. ఒకవేళ అత్యధికంగా 3 డిగ్రీలు పెరిగితే, ఈ భూస్థలి మీది ప్రాణుల్లో దాదాపు మూడోవంతు కథ ముగిసిపోతుందట. ఒక రకంగా ఈ నివేదిక తుది హెచ్చరిక. శాస్త్రవేత్తలు తమ తదుపరి నివేదికను ఈ దశాబ్ది చివరలో వెల్లడిస్తారు. ఇప్పుడు గనక కళ్ళు తెరవకుంటే, అప్పటికి పరిస్థితి చేయి దాటి, చేయడానికి ఏమీ లేకుండా పోతుంది. 

పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను గమనిస్తే, గ్రీన్‌హౌస్‌ వాయువులు సహా అనేక అంశాల్లో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేసిన వాగ్దానాలు ఇందుకు ఏ మాత్రం సరిపోవు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా సరే... ఉద్గారాలు దాదాపు 14 శాతం పెరిగి, సంక్షోభం తప్పదని నిపు ణుల హెచ్చరిక. కాబట్టి, ప్రపంచ దేశాలు మరింత ఉన్నత లక్ష్యాలను పెట్టుకోక తప్పదు. ఐరాస లక్షించినట్టుగా వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను 45 శాతం మేర తగ్గించాలి. 2050 కల్లా ఉద్గారాలలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధించాలి. ఈ ఐరాస లక్ష్యాలకు ఇక నుంచైనా కట్టుబడి ఉండడం ప్రపంచ శ్రేయస్సుకు కీలకం.

పరిస్థితి ఇవాళ ఇంత ముంచుకొచ్చిందంటే, దానికి కారణం... మనమే! గతంలోని నిష్క్రియా పరత్వం, ముందుగానే మేల్కొని ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయడంలో వైఫల్యం – ఇవన్నీ ఇప్పుడు కట్టికుడుపుతున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి తక్కువ కర్బన ప్రత్యామ్నాయాలకు క్రమంగా మారాలనే ఆలోచన ఇప్పుడిక చాలేలా లేదు. ఆర్కిటిక్‌ దగ్గరి శాశ్వత ఘనీభవన మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందనీ, అమెజాన్‌ వర్షారణ్యం కాస్తా గడ్డిపరకల సవానా భూమిగా మారుతుందనీ ఆందోళన కనిపిస్తోంది. అంటే, ఐపీసీసీ అంచనాల కన్నా ముందే పర్యావరణ ఉత్పాతాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. పర్యావరణాన్ని వేడెక్కించే గ్రీన్‌హౌస్‌ వాయువులంటే ఒక్క కార్బన్‌ డయాక్సైడే కాకపోయినా, దానితో సహా అన్నిటికీ అడ్డుకట్ట వేయాలి. శిలాజ ఇంధనాలను పట్టుకొని వదలని నేరస్థ దేశాలన్నీ సత్వరం తమ పద్ధతులు మార్చుకోవాలి. 

మన దేశమూ కొన్నేళ్ళుగా వాతావరణ సంక్షోభాన్ని చవిచూస్తోంది.  మొత్తం 75 శాతం జిల్లాలు వాతావరణంలో అతి మార్పులకు అడ్డాలయ్యా యని ‘కౌన్సిల్‌ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’ చేసిన 2021 నాటి అధ్యయనం. పునరు త్పాదక ఇంధనాల వైపు మనం ఎంత త్వరగా కదిలితే అంత మంచిది. కానీ, కనుచూపు మేరలో అది జరిగేలా కనిపించకపోవడమే దురదృష్టం. తాజా ఉక్రెయిన్‌ యుద్ధంతో జర్మనీ లాంటివి తాజాగా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకొని, 10 వేల కోట్ల యూరో కరెన్సీని సైనిక సంపత్తిపై ఖర్చు పెడుతున్నాయి. అదే దశాబ్దకాలంగా ప్రకృతి యుద్ధం ప్రకటించినా, అండగా నిలిచేందుకు చేతులు రాకపోవడం దురదృష్టం. ఇక, చేతులు కాలక ముందే మనం తప్పులు సరిదిద్దుకోవడం అవసరం. పర్యావరణ అనుకూల విధానాలతో జీవించేమార్గాన్ని అలవరచుకోవడమే ప్రపంచానికి శ్రీరామరక్ష.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top