అధినేతలపై చిచ్చర పిడుగు

Sakshi Editorial On Greta Thunberg Speech In UN

కోటలు దాటే మాటలే తప్ప కాస్తయినా కదలిక లేని ప్రపంచ దేశాధినేతల తీరును వారి సమక్షం లోనే తూర్పారబట్టిన పదహారేళ్ల స్వీడన్‌ బాలిక గ్రెటా థన్‌బర్గ్‌ మనం ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నామో మూడురోజులపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సదస్సులో ఎలుగెత్తి చాటింది. అంతకంతకూ పెరుగుతూపోతున్న భూతాపోన్నతి పర్యవసానాలు సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నాయి. అకాల వర్షాలు, వరదలు, కరువులు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. నేలలు చవుడుబారి ఎడారులు విస్తరిస్తున్నాయి. అడవులు కార్చిచ్చులబారిన పడుతు న్నాయి. సముద్రాలు వేడెక్కుతున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సముద్రమట్టాలు పెరుతుతున్నాయి.

ముంచుకొచ్చే ముప్పు గురించి ఇవన్నీ ప్రకృతి పదే పదే మనకు చేస్తున్న హెచ్చరికలు. కానీ దేశాధినేతలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని గంభీరమైన వాగ్దానాలు చేయడమే తప్ప, అందుకు అనుగుణమైన కార్యాచరణకు నడుం బిగించడం లేదు. అందుకే ప్రపంచ దేశాల అధినేతలనుద్దేశించి గ్రెటా థన్‌బర్గ్‌ ‘రానున్న ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలిసి కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నార’ంటూ నిప్పులు చెరిగింది. ఆమె ధిక్కార స్వరానికి కొన్ని దేశాల అధినేతల నుంచి అనుకూల స్పందన వచ్చింది. అందులో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ‘వాతావరణ మార్పులను అరి కట్టేందుకు ఇంతవరకూ చాలా మాటలు చెప్పాం. ఇక చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆస న్నమైంద’ని ఆయన పిలుపునిచ్చారు. ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని సూచించారు. తమ వంతుగా శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంతక్రితం ప్రకటించిన స్థాయి కంటే భారీగా పెంచుతున్నట్టు ప్రకటించారు.

వాస్తవానికి 2015 డిసెంబర్‌లో జరిగిన పారిస్‌ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో చరిత్రాత్మక ఒడంబడిక కుదిరినప్పుడు, 2020కల్లా ప్రపంచ దేశాలన్నీ దీనికి మించిన క్రియాశీలమైన కార్యా చరణ ప్రణాళికల అమలు ప్రారంభించాలని అది నిర్దేశించింది. ఎందుకంటే ఆ లక్ష్యాలకు కనీసం మూడింతలు మించితే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదు. నాలుగేళ్లు గడిచాక చూస్తే ఆమోదించిన ప్రణాళికలనైనా సక్రమంగా అమలు చేసే చిత్తశుద్ధిని ఏ దేశమూ చాటలేకపోయింది. ఫలితంగా కర్బన ఉద్గారాల తీవ్రత నానాటికీ పెరుగుతూ పోతోంది. తాజాగా ముగిసిన వాతావరణ శిఖరాగ్ర సదస్సు చూస్తే సంపన్న దేశాల బాధ్యతారాహిత్యం బయటపడుతుంది. ఈ సదస్సులో 60 దేశాల అధినేతలు తాము గతంలో అంగీకరించిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటా మని ప్రతినపూనగా అందులో మెజారిటీ దేశాలు చిన్న దేశాలే. ఇవన్నీ తక్కువ స్థాయి కాలుష్యకా రక దేశాలే. కర్బన ఉద్గారాలు అధికంగా విడిచే జాబితాలో అగ్రభాగాన ఉన్న అమెరికా, చైనాలు మాత్రం మౌనంగా ఉండిపోయాయి. అమెరికా అసలు పారిస్‌ ఒడంబడికకే తిలోదకాలిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఈ శిఖరాగ్ర సదస్సులో కేవలం 14 నిమిషాలు మాత్రమే కాలక్షేపంచేసి ఏ ప్రక టనా చేయకుండా నిష్క్రమించారు. పైగా గ్రెటా థన్‌బర్గ్‌ను ఎగతాళి చేస్తూ ట్వీట్‌ చేశారు.  కొత్తగా అలయెన్స్‌ వంటి బడా బీమా సంస్థలు వాతావరణ మార్పుల్ని నిరోధించడానికి తీసుకునే చర్యలకు తమ సహకారం ఉంటుందని ప్రకటించడం ఉన్నంతలో ఊరటనిస్తుంది. అయితే శిఖరాగ్ర సద స్సులో థన్‌బర్గ్‌వంటి నిప్పులు కురిపించే కార్యకర్తల కృషి, వెలుపల రోడ్లపై పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు సాగించిన ఆందోళనవల్లే ఈమాత్రమైనా జరిగిందని గుర్తుంచుకోవాలి. 

నార్వే, అర్జెంటినా, ఇథియోపియా, టర్కీ తదితర 70 దేశాలు తాము గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని ముందుకొచ్చాయి. తమ కర్బన ఉద్గా రాలను పూర్తిగా తగ్గించుకుంటాయని వాగ్దానం చేసిన దేశాలన్నీ వాతావరణ మార్పుల వల్ల భూభా గాలను కోల్పోయే దేశాలే కావడం గమనార్హం. మార్షల్‌ ఐలాండ్స్‌ అందులో ఒకటి. పరిమిత భూభాగం ఉండి, తమ అవసరాలన్నిటికీ దిగుమతి చేసుకుంటున్న శిలాజ ఇంధనాలపైనే ఆధార పడే ఆ దేశం, 2050 కల్లా తాము కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా పరిహరిస్తామని సదస్సులో ప్రక టించింది. డెన్మార్క్, ఫిజీ, గ్రెనెడా, లగ్జెంబర్గ్, మొనాకో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, సెయింట్‌ లూసియా, స్విట్జర్లాండ్‌ వంటి మరో 15 దేశాలు కూడా ఈ బాటలోనే ఉన్నాయి. శిలాజేతర ఇంధన లక్ష్యాన్ని పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో హామీ ఇచ్చిన 150 గిగావాట్ల నుంచి ఇప్పుడు 450 గిగావాట్లకు పెంచుతున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటన హర్షించదగిందే అయినా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ విషయంలో మన దేశం చేయాల్సింది చాలా ఉంది. పర్యా వరణ అనుమతులకు అనుసరించే విధానాలను మరింత కఠినం చేయాలి.

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతించడం పర్యావరణానికి హాని చేసేదే. వచ్చే డిసెం బర్‌లో చిలీలోని శాంటియాగోలో జరిగే ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌) 25 సదస్సు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టడానికి తీసుకునే నిర్దిష్ట చర్యల్ని ఖరారు చేసే సందర్భం. అప్పటికల్లా ప్రతి దేశమూ కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యమెంతో, దాన్ని సాధించడానికి తాము అనుసరించదలచిన ప్రణాళికేమిటో ఆ సదస్సులో నిర్దిష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. పైగా ఆ లక్ష్యాలు పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రకటించిన లక్ష్యాలకు మించి ఉండాలి. అయితే నిర్దేశించు కున్న లక్ష్యాలను ఉల్లంఘించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం, వాటికి జవాబుదారీతనం అల వర్చడం తదితరాలు లేకపోవడం పెద్ద లోపమనే చెప్పాలి. కాప్‌ 25 సదస్సునాటికైనా ఆ దిశగా ఆలోచించడం ఉత్తమం. లేనట్టయితే భవిష్యత్తరాలకు సురక్షితమైన, భద్రమైన ప్రపంచాన్ని వార సత్వంగా అందించడం అసాధ్యమవుతుందని మరిచిపోరాదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top