ఇది ఎవరి తప్పు? | Sakshi
Sakshi News home page

ఇది ఎవరి తప్పు?

Published Fri, Dec 29 2023 12:01 AM

Sakshi Editorial On Illegal immigration, human trafficking

ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ చిత్రం ‘డంకీ’ గత గురువారం విడుదలైనప్పుడు, సరిగ్గా అలాంటి కథే కళ్ళ ముందుకొస్తుందని ఆయనా ఊహించి ఉండరు. సరైన విద్యార్హతలు లేకున్నా, సంపాదనకై లండన్‌కు అక్రమంగా వలసపోవాలనుకొనే నలుగురు పంజాబీల చుట్టూ తిరిగే షారుఖ్‌ ఖాన్‌ సినిమా అది. ఈ రోజుల్లో అలాంటి కథ ఏ మేరకు ప్రాసంగికమంటూ కొందరు స్తనశల్య పరీక్ష చేస్తున్నవేళ, యాదృచ్ఛికంగా అచ్చంగా ఆ సినిమాలో లానే, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో భారతీయ అక్రమ వలసల ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి నికరాగ్వా వెళ్ళాల్సిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడానికి ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాత్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఊహించని విషయం బయటపడింది. విమానంలో మనుషుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఉప్పందడంతో ఫ్రాన్స్‌ పోలీసులు బరిలోకి దిగేసరికి, అమెరికాకు అక్రమంగా పోవాలనుకున్నవారి ఆశ అడియాస అయింది. పక్కన తోడెవరూ లేని 11 మంది మైనర్లతో సహా మొత్తం 303 మంది విమాన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులే. భారత్‌ నుంచి నేటికీ భారీగా సాగుతున్న అక్రమ వలసలకు ఇది మచ్చుతునక.

వివిధ దేశాలకు అక్రమ వలసలు కొత్త కాదు. కానీ ఈ పద్ధతిలో, ఇంత భారీ సంఖ్యలో జరగడం మాత్రం కొత్తే. నికరాగ్వా వీసా మాత్రమే ఉన్నప్పటికీ వారిని అక్రమంగా అమెరికా పంపాలనేది పథకమనీ, ఈ వ్యవహారం నడిపిన ఇద్దరు అనుమానితుల్ని ఫ్రాన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకు న్నారనీ, ప్రయాణికుల్లో పాతిక మంది శరణార్థులుగా ఆశ్రయం కోరారనీ వార్త. ఇక, మిగిలిన 276 మంది మంగళవారం ముంబయ్‌కి విమానంలో సురక్షితంగా తిరిగొచ్చారు. వ్యవహారం ఇంతటితో ముగిసినట్టనిపిస్తున్నా, అసలు కథ ఇప్పుడే ఉంది.

రొమేనియా దేశపు ప్రైవేట్‌ కంపెనీ నడుపుతున్న విమానంలో ఈ అక్రమ వలస యానం వెనుక అసలు ఉన్నదెవరు? అమెరికా ఆశ చూపి అమాయకు లకు టికెట్లు, వీసాలు ఏర్పాటు చేసిన ప్రయాణ ఏజెన్సీలేమిటి? ఈ ‘డాంకీ/ డంకీ రూట్‌’ (అక్రమ ప్రయాణమార్గం), ప్రత్యేక విమానాలను ఖరారు చేసిందెవరు? ఇలాంటి అనేక విషయాల దర్యాప్తు మిగిలే ఉంది. నికరాగ్వా చేరకముందే, ఫ్రాన్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనేసరికి కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోరడం అచ్చంగా ‘డంకీ’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేస్తుంది. 

నిజానికి, అమెరికాలోని అక్రమ వలస జనాభా విషయంలో మెక్సికో, ఎల్‌ సాల్వడార్‌ తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2021 నాటి ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ఈ వాస్తవం వెల్లడించింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులే! మరో మాటలో – అమెరికాలోని ప్రతి ఆరుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో ఉంటున్నవారే! గమనిస్తే, ఒక్క 2022– 23లోనే 96,917 మంది భారతీయులు అక్రమ వలసదారులుగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేశారు.

అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే, అది 51.61 శాతం ఎక్కువ. వీరిలో దాదాపు 41 వేల మందికి పైగా మెక్సికన్‌ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి వెళ్ళాలని చూశారు. ఎలాగైనా సరే అగ్రరాజ్యపు సందిట్లోకి చేరాలనుకొనే వారికి ప్రయాణ పత్రాలు సులభంగా పుట్టే నికరాగ్వా వాటమైన మజిలీ. మధ్య అమెరికాలోని ఆ అతి పెద్ద దేశం మీదుగా వలస పోతున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల అనేకం వచ్చాయి. 

అసలింతమంది భారతీయులు విదేశాలకు వలస పోవాలని ఎందుకనుకుంటున్నట్టు? భార తీయ అమెరికన్‌ కుటుంబ సగటు ఆదాయం లక్షా 30 వేల డాలర్లు. స్వదేశంలో సరైన ఉపాధి, ఉద్యోగాలు లేక అధిక శాతం మంది విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి చోట్ల మెరుగైన ఆదాయం, ఆనందమయ జీవితాలను వెతుక్కుంటూ, ‘డాంకీ/ డంకీ రూట్‌’లోనైనా సరే అక్కడకు చేరిపోవాలని ఆరాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, తాజాగా దొరికిన లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో అధిక శాతం మంది పాశ్చాత్య సమాజంతో దీర్ఘకాలిక సంబంధమున్న సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్‌ల వారే! ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డవారు సొంత భాష, ప్రాంతానికి చెందిన ఈ అక్రమ వలసదారులకు అండగా, సురక్షిత ఆశ్రయంగా మారడం సహజమే. 

సంపన్న దేశాల్లో శ్రామికశక్తి లోటును భర్తీ చేయడానికి మనుషులు కావాలి కానీ, సాంస్కృతిక అంతరాల రీత్యా అక్కడ వలసదారులకు లభించే గౌరవం ఎంత అన్నది చర్చనీయాంశమే. దేశాల సరిహద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ వ్యాపారంలో జరిగిందే తప్ప, ఇప్పటికీ వ్యక్తులను అనుమతించడంలో, ఆదరించడంలో కాలేదన్నది నిష్ఠురసత్యం. ఏ దేశానికి ఆ దేశం తనవైన నియమ నిబంధనలు పెట్టుకోవడం సహజమే. అయితే, ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలేసి, మెరుగైన జీతం, జీవితం కోసం మనవాళ్ళు గల్ఫ్‌ నుంచి అమెరికా దాకా వివిధదేశాలకు వలసపోతున్న తీరుకు కారణాలపై సమాజం, సర్కారు పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాలి.

భవిష్యత్తు అనిశ్చితమని తెలిసినా సరే, ఎండమావుల వెంటపడి ప్రాణాల్ని పణంగా పెడుతున్న భారతీయ శ్రామికశక్తికి ఇక్కడే ఎందుకు సలక్షణ జీవనమార్గం చూపించలేకపోతున్నామో ఆలోచించాలి. దూరపుకొండల వైపు ఆశగా చూస్తున్న అమాయకులను బుట్టలో వేసుకొని, కళ్ళ ముందు గాలి మేడలు చూపెడుతున్న ఏజెంట్ల వ్యవస్థను పసిగట్టాలి. ప్రాణాంతక అక్రమ వలసలకు ప్రోత్సహిస్తున్న వారి పనిపట్టాలి. ప్రాచీన కాలపు బానిస వ్యాపార వ్యవస్థకు ఆధునిక రూపాంతరమైన మానవ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. తాజా విమానయాన ఉదంతం అందుకు ఓ మేలుకొలుపు. 

Advertisement
Advertisement