ట్రిపుల్‌ వన్‌ (111) జీవో రద్దు: గండిపేట రహస్యం! | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ వన్‌ (111) జీవో రద్దు: గండిపేట రహస్యం!

Published Sun, May 21 2023 3:26 AM

Sakshi Editorial On Gandipet Water By Vardhelli Murali

హైదరాబాద్‌ నగర చల్లదనం ఓ పాతతరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ నగరం వేసవి విడిదిగా ఉండేదని చెబితే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. పైగా నవ్వుకోవచ్చు. గండిపేట నీళ్ల తీయదనం కూడా మన కళ్ల ముందే జ్ఞాపకాల్లోకి జారిపోతున్నది. నగరానికి పడమటి దిక్కున ఆనుకొని ఉన్న 84 గ్రామాలను వెనుకబాటుతనం నుంచి ‘విముక్తం’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం వేగంగా విస్తరిస్తూ శివారు పల్లెలనూ, పచ్చదనాలనూ ఆక్రమిస్తూ సాగుతున్నది. ఈ పరిణామంతో భూముల ధరలు పెరగడం వల్ల శివారు రైతులకూ అంతో ఇంతో ఆర్థిక లబ్ధి కలుగుతున్నది.

నగరంలోని ఖరీదైన, పురోగామి పథంలో ఉన్న ప్రదేశాలకు ఈ 84 గ్రామాలు అతి చేరువలో ఉంటాయి. పాతికేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ట్రిపుల్‌ వన్‌ (111) జీవో ఆంక్షలు ఈ ప్రాంత వాసులకు శాపంగా మారాయని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ భూములున్నవారిది కూడా అదే అభిప్రాయం. కొందరు ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్‌ బాబులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. మరెందుకింక ఆలస్యం? ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు మొన్నటి కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకున్నది.

అనంతగిరుల్లో పుట్టిన మూసీ, దాని ఉపనది ఈసీల మీద ఆనకట్టలు కట్టి ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరానికి ఆధునిక వన్నెలు తొడిగి ప్రపంచపటంలో సగర్వంగా నిలబెట్టిన నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఖాతాలోదే ఈ జంట జలాశయాల ఘనత కూడా! మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించడం, నగరవాసుల దాహార్తిని తీర్చడం అనే రెండు లక్ష్యాల సాధన కోసం సర్‌ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఈ రెండు చెరువులను తవ్వించారు.
సుమారు యాభయ్యేళ్లపాటు ఈ జంట జలాశ యాలే పూర్తిగా సిటీ అవసరాలను తీర్చాయి. విస్తరణ వేగం పెరగడంతో క్రమంగా మంజీర, కృష్ణా జలాలు వచ్చి చేరాయి. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కోటి దాటిన నగర జనాభా అవసరాలను తీర్చడంలో ఈ జలాశయాల వాటా ప్రస్తుతం 15 శాతమే. అయినా గండిపేట గండిపేటే! గండిపేట నీళ్లు ఏ ప్రాంతానికి సరఫరా అవుతాయంటూ ఇప్పటికీ ఆరా తీసేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు.

నగర నీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నాము కనుక జంట జలాశయాల మీద ఆధారపడే అవసరం లేదనీ, కావాలంటే వాటిని కూడా గోదావరి జలాలతో నింపు తామని ప్రభుత్వం చెబుతున్నది. వందేళ్ల క్రితం నదీ ప్రవాహాల మీద నిర్మించిన తటాకాలు, ఇన్నేళ్లుగా ఆ తటాకాల చుట్టూ అల్లుకున్న ఎకోసిస్టమ్, ఏర్పడిన పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత మంతటా భూగర్భ నీటి ఊటలు... ఇటువంటి వ్యవస్థకు పైపుల ద్వారా లేదా కాల్వల ద్వారా నీటిని తరలించి నింపే రిజర్వాయర్లు సరైన ప్రత్యామ్నాయమేనా? సరే, ‘విస్తృత’ ప్రజాప్రయో జనాల కోసం పర్యావరణంతో రాజీ పడటం, బడుగుల జీవితాలను బలిచేయడం నేర్చుకున్నాము కనుక ఈ ప్రత్యామ్నా యాలతో కూడా రాజీ పడవచ్చు. నిజంగా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయా? అన్నదే ప్రశ్న. జీవో రద్దుతో ఎవరికి మేలు? ఎవరికి నష్టం? చర్చించవలసి ఉన్నది.

గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉండే మొయినాబాద్‌ మండలంలోని సాగుయోగ్యమైన భూమిలో ఇప్పుడు స్థానిక రైతుల చేతిలో 20 శాతం భూమి మాత్రమే ఉన్నది. పలు రియల్‌ ఎస్టేట్, కాంట్రాక్ట్‌ సంస్థలకు వందల ఎకరాల్లో భూములు న్నాయి. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఐఏఎస్‌ – ఐపీఎస్‌ అధికారులకు, సినీనటులకు పది నుంచి పాతికెకరాల వరకు భూములున్నాయి. శంషాబాద్‌ మండలంలోనూ అదే కథ. ఎనభై శాతానికి పైగా పరాధీనమైంది.

తొందరపడి ఎకరా రెండెకరాలను పప్పుబెల్లాలకు అమ్ముకున్న చిన్న రైతులందరూ ఇప్పుడు దినసరి కూలీల అవతారమెత్తారు. జీవో రద్దయిన సంగతి తెలుసుకుని తమ వారసత్వ భూముల దగ్గరకెళ్లి దీనంగా చూస్తున్నారు. తాము ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటయినందుకు మౌనంగా రోదిస్తున్నారు.

షాబాద్‌ మండలంలో రెండే గ్రామాలు జీవో పరిధిలో ఉన్నాయి. ఇందులో 40 శాతం మాత్రమే స్థానిక రైతుల చేతిలో ఉన్నది. చేవెళ్ల మండలంలో జీవో పరిధిలోకి వచ్చే తొమ్మిది గ్రామాల్లో 70 శాతం భూమి పరాధీనమైంది. అంతో ఇంతో స్థోమత గల రైతులు మాత్రమే భూముల్ని నిలబెట్టుకోగలిగారు. చిన్న రైతులందరూ అవసరాల కోసం, ప్రలోభాలకు లోనై అమ్మే సుకున్నాను.

శంకర్‌పల్లి మండలంలో జీవో పరిధిలోని ఏడు గ్రామాల్లో రైతుల దగ్గర మిగిలింది 15 శాతం భూమి మాత్రమే! ఎకరాకు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా వెచ్చించి బడాబాబులు భూములు కొనుగోలు చేశారు. అజీజ్‌నగర్‌ వంటి సమీప ప్రాంతాల్లో కొంత ఎక్కువ పెట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేత ఖాయమని తెలిసి ఈ ఏడాదిలోపు కొనుగోలు చేసిన వారు మరికొంత ఎక్కువ వెలకట్టి ఉండవచ్చు.

జీవో ఎత్తివేసిన ప్రకటన తర్వాత మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే బడాబాబులకు  సగటున ఎకరాకు ఐదు కోట్ల లాభం చేకూరినట్టు అంచనా వేస్తున్నారు. సుమారు 70  వేల ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన వారికి ఎంత ప్రయోజనం చేకూరిందో ఎవరి లెక్కలు వారు వేసు కోవచ్చు.

అక్కడ మౌలిక వసతులు విస్తరించి, నగరం పెరుగు తున్నకొద్దీ బడాబాబుల భూములు బంగారు గనులవుతాయ నడంలో ఆశ్చర్యమేముంటుంది? భూములు రైతుల చేతుల్లో ఉన్నప్పుడు ఆంక్షల సంకెళ్లలో బంధించి, బడాబాబుల చేతుల్లోకి 80 శాతం బదిలీ అవగానే ‘విముక్తి’ చేయడంలోని మతలబు ఏమిటో తేలవలసి ఉన్నది.

నీటిపారుదల ప్రాజెక్టుల కోసం లక్షలాది ఎకరాల సాగు భూమినీ, ఇళ్లనూ, వాకిళ్లను సమర్పించుకొని నిర్వాసితులైన వేలాది కుటుంబాల మీద ఎన్నడూ కురవని సానుభూతి వాన జల్లు ట్రిపుల్‌ వన్‌ జీవో పరిధిలోని నయా ‘భూ’పతుల మీద కురవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

‘విస్తృత ప్రజా ప్రయోజనాల’ రీత్యా తీసుకున్న జీవో రద్దు నిర్ణయానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి? రాబోయే తరాల భవిష్యత్తని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం సంకల్పించింది. నగర జీవనం నందనవనంగా మారితేనే అది సాధ్యమౌతుంది. ఇరవై శాతం నీటి వనరులు, మరో ఇరవై శాతం హరితహారం ఉంటేనే అది నందనోద్యానంగా విలసిల్లుతుంది. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఆ ఘనత ఉన్నది.

వందలాది చెరువులు కాలనీలుగా మారిపోయాయి. తోటలు పేటలుగా మారాయి. నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. ఈ మార్పు ఫలితంగా నగర ఉష్ణోగ్రతలు ఇప్పటికే సగటున రెండు డిగ్రీలు పెరిగాయని వాటర్‌మ్యాన్‌ రాజేందర్‌సింగ్‌ హెచ్చరి స్తున్నారు. ట్రిపుల్‌ వన్‌ జీవోను ఎత్తివేస్తే ఈ జంగిల్‌ అక్కడ కూడా విస్తరిస్తుందనీ ఉష్ణోగ్రతలు, భూతాపం మరింత పెరిగి విధ్వంసకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరివాహక ప్రాంతపు నేలలు స్వభావరీత్యా డైక్‌ ల్యాటరేట్‌ కేటగిరీకి చెందినవట. భారీ వర్షాలకు కుంగిపోయే స్వభావం ఈ నేలలకు ఉన్నదంటారు. ఇటువంటి నేలల్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు చేరితే అవి త్వరగా వ్యాప్తిచెంది జలాశయాల్లోకి చేరుతాయి. ఈమేరకు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన రెండు నిపుణుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికల ఆధారంగానే సుప్రీంకోర్టు జీవోను సమర్థించింది.

ఇప్పుడు మళ్లీ ఈ సమస్య సుప్రీంకోర్టుకూ, గ్రీన్‌ ట్రిబ్యునల్‌కూ వెళితే ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. పర్యావరణ సందేహాలకు సమాధానాలు చెబుతూ, విస్తృత ప్రజా ప్రయోజనాలను వివరిస్తూ ఒక వివరణ ఇచ్చిన తర్వాతనే ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అటువంటి వివరణ లేకపోతే జనం మదిలో అదొక గండిపేట రహస్యంగానే మిగిలిపోతుంది.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement