Omicron Variant: భయం వీడు, జాగ్రత్తగా నడు!

Sakshi Editorial On Covid Omicron Variant

కరోనా వైరస్‌ కొత్త వైవిధ్యం (వేరియంట్‌) ఒమిక్రాన్‌ కోరలు చాస్తోంది. దీని వ్యాప్తి అత్యంత వేగమని నిర్ధారణ అయింది. త్వరతిగతిన దేశదేశాలకు విస్తరిస్తోంది. అది చూపే ప్రభావ తీవ్రత గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఎక్కడికక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఉలిక్కిపడ్డ ప్రపంచం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తాజా వైవిధ్యం ఒమిక్రాన్‌ స్వభావం, పనితీరు, ప్రమాద తీవ్రత, టీకాల ప్రభావం, వాటిల్లో మార్పు అవకాశాలు... ఇత్యాది అంశాలను పరిశీలిస్తున్నారు.

వేర్వేరు చోట్ల, విభిన్న కోణాల్లో ప్రపంచ శాస్త్రరంగం ఇదే అంశంపై పరిశోధనలు చేస్తోంది. మన దేశంలోనూ ప్రభుత్వాలు వేగంగా కదులుతున్నాయి. వైద్య వ్యవస్థల్ని, పౌరుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. పౌర సమాజం నుంచి స్పందన పెరగాలి. బెంగళూరు కేంద్రంగా నిర్ధారణ అయన రెండు కేసులు కాకుండా ప్రస్తుతం జన్యుక్రమ విశ్లేషణలోని కేసులు తెమిలితే గానీ మొత్తం ఒమిక్రాన్‌ కేసులెన్ని, దేశంలో దీని వ్యాప్తి ఎలా ఉందన్నది వెల్లడికాదు. నిన్నా ఇవాళ కోవిడ్‌ పాజిటివ్‌గా వెల్లడైన కేసుల నమూనాల్ని కూడా జన్యుక్రమ విశ్లేషణ కోసం పరిశోధనాలయాలకు పంపించారు.

ఒమిక్రాన్‌తో సంబంధం లేకుండా కూడా డెల్టా కేసులు తెలంగాణ రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. దానికి ఒమిక్రాన్‌ తోడై, సదరు వ్యాప్తిని గుణింతం చేస్తే పరిస్థితి ఆందోళనకరమే! ఈ తరుణంలో అలక్ష్యం–నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రకంగా దేశంలో కోవిడ్‌ మూడో అల మొదలయినట్టే భావించాలన్న అభిప్రాయం వైద్య, శాస్త్రరంగ నిపుణుల్లో వ్యక్తమవు తోంది. భయం కన్నా జాగ్రత్తలు ముఖ్యమని వారు పదే పదే చెబుతున్నారు.

వైరస్‌ ప్రభావం, అది కలిగించే నష్టం పరంగా చూసినపుడు డెల్టా కన్నా ఒమిక్రాన్‌ ఒకింత తక్కువ ప్రమాదకారే అని ప్రాథమిక అభిప్రాయం ఉన్నప్పటికీ, అది నిర్ధా్దరణ అయిన అంశం కాదు! సందేహాలకతీతంగా రుజువు కావాల్సి ఉంది. ఈ లోపున వైరస్‌ వ్యాప్తిని నిలువరించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిం చాలి. అదే నిర్లక్ష్యం చేస్తే, రాగల పరిణామాలు ఏ విధంగానైనా ఉండొచ్చు! టీకాల ప్రక్రియ పూర్తికాని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వైవిధ్య ప్రభావం తీవ్రంగా ఉంటే... భారీ మూల్యమే చెల్లిం చాల్సి వస్తుంది.

ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడం, సమన్వయ లోపం వంటి చిన్న కారణాలతోనే ఏడెనిమిది మాసాల కింద, దేశంలో రెండో అల ఉధృతి పెరిగినపుడు అపార నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. వైరస్‌ బారినపడ్డ అత్యధికుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. వారికిపుడు రెట్టింపు ప్రమాదమని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉంటుందో తేలకుండా భయోత్పాతం సృష్టించే ప్రకటనలు సమం జసం కాదు. ఇది బహుళ ప్రజానీకాన్ని అశాంతికి, ఆందోళనకు గురిచేస్తుంది. అంతే కాక సదరు పరిస్థితిని సానుకూలంగా మలచుకొని వైద్య–ఔషధరంగాలు దోపిడీకి పాల్పడే ప్రమాదాన్నీ నిపు ణులు శంకిస్తున్నారు. శాస్త్రీయంగా ధ్రువపడని అంశాల్లో ఆధారరహితమైన ప్రకటనలు చేయడం వ్యక్తులకు, సంస్థలకు పాడికాదనే వారంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌), సీసీఎమ్బీ వంటి ప్రాధికార సంస్థలు కూడా ఇప్పటికిది ప్రమాదకారి అని నిర్ధారణ కాలేదనే చెబుతున్నాయి.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లో ఉందని, తద్వారా ప్రమాద తీవ్రతనే కాదు, ప్రమాద ఆస్కారాన్నీ తగ్గించవచ్చని వారందరి భావన! జనం నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు ఏ మాత్రం చేయిజారినా ప్రభుత్వాలు తీవ్ర నిర్ణయాలకు వెళ్లాల్సి ఉంటుంది. మళ్లీ కట్టడి విధించడం, కఠిన నిబంధనలు, నిషేధాజ్ఞలు... జనజీవన ప్రతిష్ఠంభన! ఇది అటు వైద్య పరంగా, ఇటు ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ పరంగానూ ఎంతో నష్టదాయకం. ముఖ్యంగా మధ్య తరగతి, అల్పాదాయ, చిన్న, చితకా కుటుంబాలకొక శాపంగా పరిణమిస్తుంది. ప్రభుత్వాలు, పరి శ్రమ, పౌర సమాజం... ఎవరికి వారు బాధ్యతాయుతంగా ఉంటూ సమన్వయం సాధిస్తేనే పరిస్థి తులు నియంత్రణలో ఉంటాయి.

తగు జాగ్రత్తలతో దేశవ్యాప్తంగా వర్తించే స్థూల నిర్ణయాలు తీసు కోవాలని, తొందరపాటు చర్యలకు తలపడవద్దని దేశ ఉత్పత్తి, పారిశ్రామిక రంగం కోరుతోంది. రాష్ట్రాలు ఇష్టానుసారం వ్యవహరించకుండా కేంద్రం కట్టడి చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి), అసోచామ్, పిహెచ్‌డీసీసీఐ వంటి సంస్థలు వేడుకుంటున్నాయి. నిజంగా పరిస్థితులు చేయిదాటితే, అంతగా అవసరమైన చోట.... అదీ స్థానికంగా ఎక్కడికక్కడ పరిమిత కట్టడి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ మాత్రం తొందరపాటు చర్యలైనా, ఇప్పుడిప్పుడే పుంజు కుంటున్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రెండో అల ఉధృతి తగ్గిన క్రమంలో వచ్చిన అలసత్వాన్ని వీడి అందరూ కోవిడ్‌ సముచిత ప్రవ ర్తన కనబర్చాలని సూచిస్తున్నారు. ఒకటి, రెండు అలలతో పోలిస్తే మూడో అల ముందస్తుగా వచ్చిన హెచ్చరికగా, తగు సంసిద్ధతకు అవకాశంగా పరిగణించాలంటున్నారు. పౌర సమాజం జాగ్రత్తగా ఉంటే ఎన్ని అలలు రేగినా.... పరిస్థితులు నియంత్రణలో ఉంటాయని ఆధారాలతో చెబుతున్నారు.

విధిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచు కోవడం మన జీవనశైలిగా మార్చుకోవాలి. అనివార్యమైతే తప్ప గుంపులుగా చేరకుండా జాగ్రత్త పడాలి. పండుగలో, పబ్బాలో, పెళ్లిల్లో, పేరంటాలో... ఏ వేడుకలూ జీవితం కన్నా ముఖ్యం కాదు. ఏ అత్యవసరాలూ ప్రాణం కన్నా అధికం కాదు. ఆ తెలివిడి చాలు, జరుగుతుంది మేలు!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top