బంగ్లాదేశ్‌తో కరచాలనం

Sakshi Editorial Article On The India And Bangladesh Friendship

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్‌ఆర్‌సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక (ఎన్‌పీఆర్‌)లు మన దేశంలో ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పటినుంచీ బంగ్లాదేశ్‌తో మన సంబంధాలు క్రమేపీ క్షీణిస్తున్నాయా అన్న సందేహం అందరికీ కలుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డాక మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావటంతో ఆయన తమకిస్తున్న ప్రాధాన్యతేమిటో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా గుర్తించేవుంటారు. ఆయన పర్యటన ముగిశాక విడుదలైన ఇరు దేశాల అధినేతల సంయుక్త ప్రకటన ‘ప్రజానుకూల సరిహద్దు’ విధానం మొదలు కొని అణుశక్తి వరకూ వివిధ అంశాలను స్పృశించింది. అయితే ఆ దేశం అత్యంత ప్రధాన మైనదిగా భావించే తీస్తా నదీ జలాల అంశం మాత్రం అందులో లేదు. ఈ విషయంలో హసీనా తన అసంతృప్తిని దాచుకోలేదు కూడా. అలాగే ఆమె పైకి చెప్పకపోయినా వారిద్దరి మధ్య చర్చల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల ప్రస్తావన వచ్చేవుంటుంది.  

‘కీలెరిగి వాత... వీలెరిగి చేత’ అన్నారు. ఎప్పుడే పని చేయాలో మోదీకి బాగా తెలుసని ఈ పర్యటన నిరూపించింది. యాభైయ్యేళ్లనాటి ఆ దేశ ఆవిర్భావంలో మన దేశానిది కీలక పాత్ర.  ఖలీదా జియా పాలనాకాలంలో, సైనిక పాలన సమయంలో ఆ దేశం భారత్‌ విషయంలో కొంత తేడాగా వున్నా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం మొదటినుంచీ మన దేశంతో సన్నిహితంగా వుంటున్నది. కనుకనే ఈశాన్యంలో సమస్యలు సృష్టించే మిలిటెంట్లను పట్టి బంధించి మన దేశానికి అప్పగించటం, వారి స్థావరాలను ధ్వంసం చేయటం హసీనా సర్కారువల్లే జరిగాయి.  కానీ గత ఏణ్ణర్ధంగా భారత్‌ అంటే ఆ దేశం గుర్రుగా వుంది. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ అమలు తర్వాత ఇది మొదలైంది. ఆ ప్రక్రియలో19 లక్షలమంది చట్టవిరుద్ధ పౌరులున్నారని తేలింది. వీరిలో ముస్లింల సంఖ్య గణనీయంగా వుంది. వీరంతా బంగ్లా పౌరులంటూ కేంద్రమంత్రులు మాట్లాడటం ఆ దేశానికి మింగుడు పడలేదు. అలాగని అది అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సరి హద్దుల్లో పటిష్టమైన నిఘా వుంటుంది కనుక తమవైపు నుంచి ఎవరూ అక్రమంగా వచ్చే అవకాశం లేదని లీకులిచ్చారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు భారత్‌ ఆంతరంగిక వ్యవహారమని ఒక సందర్భంలో హసీనా అన్నారు. అలా అంటూనే సీఏఏ అనవసరమని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్య కలకలం సృష్టించింది. ఇలాంటి సమయంలో ప్రధాని అక్కడకు పర్యటనకెళ్లటం దౌత్యపరంగా మంచిదే. ఎందుకంటే మన పట్ల అసంతృప్తిగా వుంటున్న ఇరుగు పొరుగు దేశాలకు చైనా చేరువవుతోంది. బంగ్లాదేశ్‌లోనూ ఆ పని మొదలుపెట్టింది. హసీనా 2019లో చైనా పర్యటించి ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కనుక ఎంత త్వరగా బంగ్లాను సన్నిహితం చేసుకుంటే అంత మంచిది. అందుకు బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సర్ణోత్సవ సంవత్సరం కన్నా మించిన సందర్భం మోదీకి వేరే వుండదు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేం దుకు సైతం ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన భావించివుండొచ్చు.

దేశ విభజనకాలంతో మొదలుపెట్టి 1965, 1971 యుద్ధ సమయాల్లో, అటు తర్వాత 2002–06 సంవత్సరాలమధ్య ఖలీదా పాలించినప్పుడు బంగ్లా భూభాగంలో వున్న హిందువులు అమానుషమైన హింసను, వేధింపులనూ ఎదుర్కొనాల్సివచ్చింది. దాంతో ఆ సందర్భాల్లో లక్షలమంది పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చి తల దాచుకున్నారు. అలా వచ్చి స్థిరపడినవారిలో నామసూద్ర పేరుతో వుండే తెగకు చెందిన మతువాలు అధికం. వారంతా ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు, జల్పాయ్‌గిరి, సిలిగురి, కూచ్‌బెహార్, వర్ధమాన్‌ జిల్లాల్లోని 30 స్థానాల్లో గణనీయంగా వున్నారు. అందువల్లే కావొచ్చు...ఆ దళిత కులానికి పితామహుడిగా చెప్పే హరిచంద్‌ ఠాకూర్‌ స్మృత్యర్థం బంగ్లాలో నిర్మించిన మందిరాన్ని మోదీ సందర్శించారు.  

ఇరుగుపొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వటం లక్ష్యంగా తీసుకొచ్చిన సీఏఏలో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లతోపాటు మిత్ర దేశమైన తమనూ జత చేయటం బంగ్లాకు ఆగ్రహం కలిగించింది. ఇక తీస్తా నదీజలాల వివాదం చాలా పాతది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011 జనవరిలోనే అది దాదాపు పరిష్కారానికి చేరువైంది. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బంగ్లాదేశ్‌ పర్యటించినప్పుడు తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. భూభాగాల పరస్పర మార్పిడి చేసుకోవటం పూర్తయింది. తీస్తాతోపాటు ఫెనీ జలాలను పంచుకోవటంపైనా ముసాయిదా ఖరారైనా మమతా బెనర్జీ అభ్యంతరంతో అది ఒప్పందంగా మారలేదు.

లక్షలాదిమందికి ప్రాణావ సరమైన తీస్తా నదీజలాల్లో తమకు న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వాలని మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో హసీనా కోరినట్టు తాజాగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌తో సన్నిహితమని చెప్పుకుంటున్నా హసీనా తీస్తాపై ఒప్పించలేకపోతున్నారని విపక్షాల నుంచి ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ఈ విషయంలో ఆమె ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. కనుక సాధ్యమైనంత త్వరలో ఈ నదీ జాలలపై ఒప్పందానికి రావటం మన దేశానికి మేలు కలిగించే అంశం. కలిసి ముందడుగు వేసి, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లో సమష్టిగా అభివృద్ధి సాధిద్దామని మోదీ బంగ్లాకు పిలుపునిచ్చారు. అది సాకారం కావాలని ఆశించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top