అద్దెకిస్తాం! అమ్మేస్తాం!!

Pakistan To Rent Out PM Official House On Editorial By Vardelli Murali - Sakshi

బహుశా ఇది కనివిని ఎరుగని విషయం. ఇంకా చెప్పాలంటే, ఊహకైనా అందని అంశం. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి (పీఎం) అధికారిక నివాస భవనాన్ని అద్దెకిస్తామని ఓ ప్రభుత్వం ప్రకటించడం ఎక్కడైనా విన్నారా? కార్ల మొదలు పాడి గేదెల దాకా ప్రభుత్వమే అమ్మేయడం ఎక్కడైనా కన్నారా? అవి ఇప్పుడు మన సోదరదేశం పాకిస్తాన్‌లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌లోని తన అధికారిక నివాస భవనాన్ని ఇప్పుడు విందు వినోదాలు, వివిధ విద్యా, సాంస్కృతిక, ఫ్యాషన్‌ ప్రదర్శనలకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వచ్చే డబ్బు కొంతలో కొంతయినా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలను తగ్గిస్తే అదే పదివేలని భావిస్తున్నారు. కానీ, అధికారిక నివాసాలకు వచ్చే కిరాయి డబ్బులతో పాకిస్తాన్‌ ఆర్థిక కష్టాలు తీరతాయా అన్నది ప్రశ్న. 

ఇమ్రాన్‌ సారథ్యంలోని పాలక ‘పాకిస్తాన్‌ తెహరీక్‌–ఎ–ఇన్సాఫ్‌’ (పీటీఐ) సర్కార్‌ 2019 ఆగస్టులోనే అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించింది. అప్పట్లోనే అలాగే, వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం అధికారిక నివాసాలలో కాకుండా, మామూలు ఇళ్ళలో ఉంటూ ఖర్చు తగ్గిస్తామన్నారు. అధికారిక నివాసాన్ని వదిలేసి, మరో ఇంటికి ఆ ఏడాదే ఆయన మారిపోయారు. పీఎం నివాసాన్ని నిర్వహించడానికి ఏటా రూ. 47 కోట్లు ఖర్చవుతాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆ ఇల్లు ఖాళీ చేస్తే, ఖర్చు కలిసొస్తు్తందన్నది ఆలోచన. అంతకు ముందు 2018 సెప్టెంబర్‌లోనూ ఇమ్రాన్‌ ఇలాంటి పనే చేశారు. అంతకు ముందు ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పీఎం నివాసంలో పెట్టుకున్న ఎనిమిది పాడిగేదెల్ని రూ. 23 లక్షలకు అమ్మేశారు. గత వారమేమో 61 లగ్జరీ కార్లు అమ్మేసి, రూ. 20 కోట్లు ఆర్జించారు. ఇంకా 102 కార్లు, నాలుగు హెలికాప్టర్లను వేలం వేయాలని ప్లాన్‌. వీటి వల్ల కలిసొచ్చిన ఖర్చు, చేతికొచ్చిన సొమ్మెంతో కానీ, నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో ఇమ్రాన్‌కు ప్రచారమైతే దక్కింది. ఇవన్నీ పొదుపు చర్యలని పాలకులంటే, వట్టి జిమ్మిక్కులన్నది ప్రతిపక్ష వాదన. 

వర్ధమాన దేశమైన పాక్‌ కొండంత అప్పుల్లో ఉంది. అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం సాక్షాత్తూ ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ సంస్థ (ఐఎంఎఫ్‌) ఇచ్చిన ప్యాకేజీలో ఆ దేశం ఇప్పటికే భాగం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, నిరుడు మొదలైన కరోనా ఆ దేశం నడ్డి విరిచింది. పంచదార, గోదుమల మొదలు టమోటాలు, ఉల్లిపాయలు, మాంసం, కోడిగుడ్లు – నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఒకదశలో అక్కడ డజను కోడిగుడ్లు రూ. 200 నుంచి 240 దాకా పలికాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడానికి తగినంత డబ్బు లేదని మూడేళ్ళ క్రితం ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడే ఇమ్రాన్‌ ఖాన్‌ కుండబద్దలు కొట్టారు. కానీ, పేరుకున్న అప్పులలో ఓ పంటి కిందకు కూడా రాని తాజా పొదుపు చర్యలు ఆ దేశ ఆర్థిక దురవస్థకు మచ్చుతునకలు. అంతర్జాతీయ సమాజంలో మర్యాదను తగ్గించే మరకలు. అసమర్థ నాయకత్వం, అవినీతి, అనవసరమైన యుద్ధ ప్రియత్వం, అంతకంతకూ పెరుగుతున్న జనాభా, ఆర్థిక రంగంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, పెంచిపోషిస్తున్న తీవ్రవాదం లాంటివన్నీ పాకిస్తాన్‌ ప్రస్తుత దుఃస్థితికి కారణాల్లో కొన్ని. వాటిని సరిదిద్దుకోకుండా, అప్పుల కోసం చైనాతో దోస్తీ కడుతూ, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు తానాతందానా అంటూ, భారత్‌తో కయ్యానికి దిగుతూ... పాకిస్తాన్‌ మరింత ఊబిలోకి దిగబడిపోతుండడమే విచిత్రం. గాయం ఒకచోటైతే, మందు మరొకచోట రాయడమంటే ఇదే! 

పాకిస్తాన్‌ను దిగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా 2008 నుంచి వర్గీకరించారు. ఉపఖండంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటున్నదీ పాక్‌లోనే! అలాగే, ప్రపంచంలోకెల్లా అధిక జనాభా ఉన్న దేశాల్లో అయిదో స్థానమూ పాక్‌దే. 1951 నుంచి 2017 మధ్య కాలంలో పాక్‌ జనాభా ఆరు రెట్లు పెరిగింది. 3.4 కోట్ల నుంచి 20.8 కోట్లు అయింది. జనాభా పెరుగుదలను అరికట్టి, సరైన చర్యలు తీసుకోకపోతే 2017 నుంచి 2050 మధ్య జనాభా ఏకంగా 84 శాతం మేర పెరుగుతుందని ఊహ. అదే సమయంలో ఆర్థిక వృద్ధి ఏమో కనాకష్టం. కనీసం మరో నాలుగైదేళ్ళ పాటు పరిస్థితి దయనీయంగా ఉంటుందని అంచనా. విద్య, ఉపాధిలోనే కాదు... చివరకు మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాల్లోనూ పాక్‌ వెనుకబడి ఉంది. ఉన్నంతలో సేవారంగాల్లో ఉపాధి దొరుకుతోంది కానీ, పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాలు బలహీనమే. ఇవన్నీ పాక్‌ను పట్టిపీడిస్తున్న పెను సమస్యలు. 

అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ వీటిని చక్కదిద్దడంలో సఫలం కాలేదు. అందుకు సరైన ప్రయత్నమూ చేసినట్టు కనిపించలేదు. చివరకు, ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌’ (ఎఫ్‌ఏటీఎఫ్‌) దేశాల ‘గ్రే లిస్టు’ నుంచైనా ఆ దేశం బయట పడనే లేదు. ఇలా చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉంటే, అద్దెలు, అమ్మకాల కంటితుడుపు చర్యలతో ఏం లాభం? మొత్తం మీద క్రికెట్‌ కెప్టెన్సీ కన్నా దేశనాయకత్వం కష్టమని 1992లో పాక్‌కు ఏకైక క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సాధించి పెట్టిన సారథి ఇమ్రాన్‌కు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆర్థికంగా దేశం గాడిన పడాలంటే ప్రచారం కోసం చేసే ప్రతీకాత్మక చర్యలు చాలవని ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన అసలు చర్యలు, చేపట్టాల్సిన ఆర్థిక వ్యూహాలు, మార్చుకోవాల్సిన రాజకీయ వైఖరుల మీద ఇప్పటికైనా దృష్టి పెడితే పాకిస్తాన్‌కు మంచిది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్నా దాయాది దేశం ఇలా మిగలడం మాత్రం ఇప్పటికీ సోదరభావం ఉన్నవారికి విచారకరమే.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top