అరుణారుణ ఆశాకిరణం

Leftist Lula Da Silva Won Brazil Presidential Election 2022 - Sakshi

వర్గాలుగా చీలిన ఓటర్లు... హోరాహోరీ పోరు... అతివాద ఛాందస దేశాధ్యక్షుడు బోల్సనారో ఒక వైపు, వామపక్ష ప్రజాస్వామ్యవాది లూలా మరోవైపు... 34 ఏళ్ళ బ్రెజిల్‌ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా దేశాధ్యక్ష ఎన్నికలు. అలాంటి సందర్భంలో ఆదివారం లూలా దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశానికి అధ్యక్షుడిగా గెలుపొందడం చరిత్రాత్మకం. 580 రోజులు జైలులో ఉండి బయటపడి, రాజకీయ విరోధుల అంచనాల్ని అధిగమించి, బలమైన ప్రత్యర్థి బోల్సనారోను ఓడించడం వామపక్ష వర్కర్స్‌ పార్టీకి లూలా సృష్టించిన అపూర్వ సందర్భం. 2020 నుంచి పొరు గున బొలీవియా, చిలీ, పెరూ, కొలంబియా, హోండురస్‌లలో ఎగిరిన ఎర్ర జెండాకు బ్రెజిల్‌ గెలుపు మరో ఊపు. అరుణారుణమవుతున్న లాటిన్‌ అమెరికాకు ఇది ప్రతీక. స్థానికవాద సెంటిమెంట్లను పెంచిపోషించే ఛాందస మితవాద ప్రభుత్వాలు ఐరోపాలో ఎన్నికవుతున్న వేళ మరో ఆశాకిరణం.  

లూలాకు దేశాధ్యక్ష పదవి కొత్త కాదు. ఆయన పగ్గాలు చేపట్టడం బ్రెజిల్‌ చరిత్రలో ఇది మూడోసారి. 2003 నుంచి 2010 దాకా నాలుగేసి ఏళ్ళ వంతున రెండు తడవలు ఆయన ఆ పదవిలో ఉన్నారు. సంక్షేమ చర్యలు చేపడుతూనే, దేశంలో ఆర్థికాభివృద్ధి, సామాజిక చేర్పు సాధించిన ప్రజాదరణ గల నేతగా నిలిచారు. మళ్ళీ పుష్కరకాలానికి పీఠమెక్కారు. మధ్యలో పదవి చేపట్టిన ఆయన శిష్యుడు 2016లో అభిశంసనకు గురికావడం, కాంట్రాక్టుల్లో అవినీతిపై 2017లో లూలా జైలు పాలవడం, 2018 ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కావడం, వీటన్నిటితో దేశంలో మితవాద పార్టీల విజృంభణ అంతా ఓ పెద్ద కథ. తాజాగా అక్టోబర్‌ 2 నాటి తొలి విడత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాని ఆయన ఆదివారం తుది విడతలో పదవిని స్థిరం చేసుకున్నారు. లూలాకు 50.9 శాతం, ప్రత్యర్థి బోల్సనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్‌ బయటపడ్డాక ఇంత స్వల్ప తేడాతో ఎన్నికల గెలుపు నమోదైంది ఇప్పుడే! 

తాజా మాజీ అధ్యక్షుడు బోల్సనారో, ఆయన మద్దతుదారులు సాగించిన నాటకీయ, విద్వేష ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసినట్టే బోల్సనారో బృందం మీడియానూ, ఎన్నికల ప్రక్రియనూ దుమ్మెత్తిపోసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఔదలదాల్చేది లేదు పొమ్మని బెదిరించింది. లూలా మాత్రం బోల్సనారో ప్రాచుర్యాన్ని అధిగమించేందుకు తన మాజీ ప్రత్యర్థి జెరాల్డో అల్క్‌మిన్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టి, వామపక్షాల నుంచి మధ్యేవాద మిత వాదుల దాకా పది పార్టీలతో జాగ్రత్తగా కూటమి కట్టారు. గెలుపు తీరాలకు చేరారు. బోల్సనారో హయాంలో 7 లక్షల పైగా మరణాలతో కోవిడ్‌ కట్టడిలో వైఫల్యాన్నీ, అమెజాన్‌ అడవుల నరికి వేతనూ, కునారిల్లిన ఆర్థికవ్యవస్థనూ బ్రెజిల్‌ చవిచూసింది. ఒకప్పుడు 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చిన లూలా లాంటి సమర్థుడికి సైతం దేశాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం సవాలే! 

కలసి పోటీ చేసిన పార్టీల కూటమిని రేపు అధికారంలోనూ లూలా ఎంత కలసికట్టుగా ఉంచగలుగుతారనేది కీలకం. అది ఆయన ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. పర్యావరణం, ప్రజారోగ్యం, విద్య, విదేశాంగ విధానం, మానవహక్కుల లాంటి అంశాల్లో పాత పాలకుడు చేసిన నష్టాన్ని పూడ్చడానికి అనుసరించే విధానాల్లో భాగస్వాములతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఆకలి, దారిద్య్రాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, పారిశ్రామిక రంగాన్ని పరిపుష్ఠం చేయడం తమ ప్రభుత్వ తక్షణ లక్ష్యాలని ఆయనే చెప్పారు. కానీ, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగం, అప్పులు, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయి. ఖజానా ఖాళీ అయింది. ఉత్పత్తి స్తబ్ధమైంది. అనేక రంగాల్లో అంతర్జాతీయ పోటీలో నిలిచే పరిస్థితి లేదు. 

ఇవి చాలదన్నట్టు రాజకీయంగానూ తిప్పలున్నాయి. సెనేట్‌లో అధిక స్థానాలు బోల్సనారోకు చెందిన లిబరల్‌ పార్టీకే ఉన్నాయి. దిగువ సభలోనూ ఆ పార్టీయే అతి పెద్ద పార్టీ. ఇక, 27 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో, అందులోనూ రియో డి జనీరో సహా కీలకమైన, మూడు అతి పెద్ద రాష్ట్రాల్లో ప్రత్యర్థి బోల్సనారో సమర్థకులే వచ్చే ఏటి నుంచి గవర్నర్లు. అలాగే, 1964 – 1985 మధ్య బ్రెజిల్‌ను ఏలిన సైనిక వ్యవస్థ, అమెజాన్‌ వర్షారణ్య దోపిడీ వ్యవస్థల శక్తిమంతమైన వ్యాపార ప్రయోజనాల్ని ఢీకొనాల్సి వస్తుంది. ఇన్నింటినీ అధిగమిస్తూ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, జనరంజకంగా పాలించడం ఎవరికైనా కత్తి మీద సామే. సహజ వనరులపైనా, చమురుతో ముడిపడ్డ ఆర్థిక విజృంభణ పైనా అతిగా ఆధారపడ్డా కష్టమేనని పొరుగున ఉన్న వెనిజులా పాఠం చెబుతోంది. 

విజయోత్సవ ప్రసంగాన్ని ఆరంభిస్తూ, లూలా అన్న మాట ఒకటే... ‘వారు నన్ను సజీవ సమాధి చేయాలనుకున్నారు. కానీ, ఇదుగో ఇప్పుడు మీ ముందు సజీవంగా నిలిచాను.’ క్లిష్టసమయంలో పదవి చేపట్టిన ఈ 77 ఏళ్ళ పోరాటయోధుడు ఇక ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షల్ని సజీవంగా నిలపాలి. ఒబామా శైలిలో ‘నాకు ఓటేసిన వారికే కాదు, మొత్తం 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ సుపరిపాలన అందిస్తాను’ అన్న మాటల్ని నిజం చేసి, విభజన రాజకీయాలకు విరుద్ధంగా దేశాన్ని ఒక్కటి చేయాలి. మునుపటిలా ప్రభుత్వ సంపదను ప్రజలకు పునఃపంపిణీ చేసే ప్రజాకర్షక సంక్షేమ విధానాలకూ, వర్తమాన ఆచరణాత్మకతకూ మధ్యన ఈ కొత్త ప్రయాణం రాజకీయ పునరుత్థానం పొందిన ఈ కురువృద్ధుడికి అసలు సిసలు అగ్నిపరీక్ష.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top