రాజు మరణించినాడు..!

Editor Vardhelli Murali Article on Situation Alarming for Congress - Sakshi

జనతంత్రం

బ్రిటన్‌లో ఒక సంప్రదాయమున్నది. ఆ దేశపు రాజుగారు చనిపోయినప్పుడు ఒక అధికారిక ప్రకటన చేస్తారు. 'The King is dead, long live the King'. రాజుగారు చనిపోయారు. రాజుగారు చిరకాలం జీవించాలి. రాజ్యం – పరిపాలన అనేవి నిరంతర ప్రక్రియలనీ, రాజు చనిపోయినా మరో రాజు సిద్ధంగా ఉన్నారనేది ఈ ప్రకటన సారాంశం. 1952లో బ్రిటన్‌ రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్‌ మరణించారు. అప్పుడు 'The King is dead, long live the Queen' అనే ప్రకటన వెలువడింది. ఆయన వారసురాలుగా ప్రస్తుత మహారాణి రెండో ఎలిజబెత్‌ అప్పుడు సింహాసనమెక్కారు. ఆమెకు సంక్రమించిన దీర్ఘాయుష్షు వలన అటువంటి అధికార ప్రకటన వినే అవసరం ఇప్పుడున్న రెండు మూడు తరాల వారికి రాలేదు.

ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ కాంగ్రెస్‌ అనేవి రెండూ విడదీయలేని అంశాలు. భిన్న సంస్కృతులు, భాషలు, పాలనా విభాగాలుగా విడివడి ఉన్న భారతీయుల్లో జాతీయతను పాదు చేసిన ప్రధాన శక్తి కాంగ్రెస్‌ పార్టీయే! బ్రిటీష్‌వాడు ఎత్తుకెళ్లింది నెమలి సింహాసనం, కోహినూర్‌ వజ్రం మాత్రమే కాదు, దేశపు నవనాడుల నుంచి రక్తాన్ని పిండుకుంటున్నాడని సశాస్త్రీయంగా నిరూపించిన దాదాబాయ్‌ నౌరోజీ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సిరిసంపదలతో తులతూగిన దేశంలో దరిద్రం తాండవమాడటానికి కారణం బ్రిటీష్‌ సామ్రాజ్య దోపిడీయేనని చెబుతూ ‘వెల్త్‌ డ్రెయిన్‌’ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. అప్పట్లో చదువుకున్న భారతీయులను ఈ వాదన కదిలించి, జాతీయ భావాలను రేకెత్తించింది. భిన్నప్రాంతాల్లోని భారతీయుల్లో సాంస్కృతిక ఏకీభావం కలిగించడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాలగంగాధర తిలక్‌ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ పునాదుల మీదనే దేశ ప్రజలందరినీ ఒక జాతిగా సమీకరించి, గాంధీజీ స్వరాజ్య సమరం సాగించి గెలిచారు. స్వాతంత్య్రం సిద్ధించేవరకూ కాంగ్రెస్‌ పార్టీ కేరాఫ్‌ అడ్రస్‌ గాంధీజీయే! స్వాతంత్య్రం తర్వాత కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్ది ఆర్థిక వృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బాటలుపరిచాయి. ఇంతటి మహత్తర చరిత్ర, ఘనత కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ‘బ్రెయిన్‌ డెడ్‌’ స్థితికి చేరుకున్నదని ఇందుమూలముగా ప్రకటించడమైనది. కాలూ, చేయి కదిపే పరిస్థితి లేదు. అవయవ దానమొక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా తోస్తున్నది. ‘పరోపకారార్థ మిదం శరీరం’ అనే ఆర్యోక్తిని పాటించడం విఖ్యాత కాంగ్రెస్‌ పార్టీకి విశిష్టమైన ముగింపు అవుతుంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్లినిక్‌ టెస్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ నిస్తేజాన్ని నిర్ధారించాయి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున నలుగురు ప్రధానమంత్రుల్ని పార్లమెంట్‌కు గెలిపించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. నెహ్రూ, ఇందిర, శాస్త్రి, రాజీవ్‌లు యూపీ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రధాని పదవిని చేపట్టకపోయినా, అనధికారికంగానే పదేళ్లు ప్రభుత్వ చక్రం తిప్పిన సోనియా గాంధీ కూడా యూపీ నుంచే లోక్‌సభ సభ్యులయ్యారు. వీళ్లంతా కలిసి సుమారు యాభయ్యేళ్లపాటు ఈ దేశాన్ని పరిపాలించారు. అటువంటి రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఫలితం రెండున్నర శాతం ఓట్లు. రెండు సీట్లు. నెహ్రూ – గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ సర్వశక్తులూ ఒడ్డి, చెమటను ధారపోసి తిరిగితే గిట్టుబాటైన ఓట్లివి. పోటీ చేసిన 97 శాతం సీట్లలో డిపాజిట్‌ గల్లంతయింది. ఆ గెలిచిన రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ పార్టీ బలంతో గెలవలేదు. రాంపూర్‌ఖాస్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆరాధనా మిశ్రా తండ్రి ప్రమోద్‌ తివారీ.. ములాయం సింగ్‌కు మంచి మిత్రుడు. తన స్నేహితుని కుమార్తెను గెలిపించడం కోసం ములాయం సలహాపై అక్కడ ఎస్పీ పోటీ పెట్టలేదు. వీరేంద్ర చౌధరి అనే మరో కాంగ్రెస్‌వాది గెలిచిన ఫరెందా నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే ఎస్పీ ఒక బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ పదింటిలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది. అమేఠీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన అమేఠీ రాజావారు సంజయ్‌సింగ్‌ ఒక రేప్‌ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఎస్పీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు.

ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నెలకొని ఉన్నది. ఒకే సంవత్సరంలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన అప్రతిష్ఠను కూడా ఆ పార్టీ బోనస్‌గా మూటగట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ప్రతిపక్ష పార్టీ అవలీలగా గెలవాల్సిన సన్నివేశం ఇది. కానీ అధికార పార్టీయే అవలీలగా గెలిచింది. కాంగ్రెస్‌ 18 సీట్లకే పరిమితమైంది. అధికారంలో ఉన్న పంజాబ్‌లో 33 శాతం జనాభా ఉన్న దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి కూడా కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. అక్కడ బీజేపీ వంటి బలమైన పార్టీ ప్రధాన పోటీదారు కాకపోయినా, శిరోమణి అకాలీదళ్‌ బలహీనపడినా కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనం పొందలేకపోయింది. అర్థబలం, అంగబలం లేని ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ చీపురు కట్టతో కాంగ్రెస్‌ అతిరథ మహారథులందర్నీ ఊడ్చిపారేసింది. గెలవడానికి అనుకూల పరిస్థితులున్న గోవాలోనూ అది చతికిలపడింది. మణిపూర్‌లో ప్రధాన పార్టీ స్థాయి నుంచి తోక పార్టీ స్థాయికి దాని పలుకుబడి క్షీణించింది.

ఇప్పుడు కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 36 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో జూనియర్‌ పార్ట్‌నర్‌గా ఆ పార్టీ ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇంత దీన పరిస్థితుల్లో ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ సాధించడం అనివార్యమవుతుందనే భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొని ఉన్నది. అదే జరిగితే పండిత్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ కొట్టిన మొనగాడుగా నరేంద్ర మోదీ పేరు చరిత్రలో రికార్డవుతుంది. కాంగ్రెస్‌ పార్టీని ఇందిరాగాంధీ మూడుసార్లు అధికారంలోకి తెచ్చినప్పటికీ మధ్యలో ఒక ఓటమి వలన ఆమె హ్యాట్రిక్‌ మిస్సయ్యింది. ఆమె చనిపోయి సానుభూతి వెల్లువతో మరోసారి పార్టీని గెలిపించింది. అందువల్ల ఆమె ఖాతాలో నాలుగు విజయాలను వేయవచ్చు.

వరుస పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని ఒక నిష్క్రియాపరత్వం, పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని ఒక విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేర్చాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా పెద్దది. అన్ని రాష్ట్రాల్లోనూ దాని ఉనికి ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం నాలుగు వేలమంది శాసనసభ్యులుంటే ఆ పార్టీ గుర్తుపై గెలిచినవారు ఇప్పటికీ 700 మంది ఉన్నారు. మొత్తం శాసనసభ్యుల్లో ఇది 17.5 శాతం. బీజేపీ తరఫున 1300 (32.5%) మంది ఉన్నారు. యాభై శాతం మంది ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలే. కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ నిస్తేజమవుతున్న నేపథ్యంలో అది కనుమరుగవడం వల్ల ఏర్పడుతున్న శూన్యాన్ని ఎవరు భర్తీ చేస్తారు? భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యామ్నాయమవుతారు? కాంగ్రెస్‌ మిగిల్చిన శూన్యాన్ని కేజ్రీలు, బెనర్జీలు పూరించగలరా? కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టు ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయమవుతుందా? సాధారణ ఎన్నికలు రెండేళ్ల దూరం మాత్రమే ఉన్న ఈ సమయంలో ఈ రకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌ పార్టీ ఒక మధ్యేవాద పార్టీగా పరిణామం చెందింది. నెహ్రూ, ఇందిరల కాలంలో కొంత లెఫ్ట్‌ ఆఫ్‌ ది సెంటర్‌గానూ, పీవీ నరసింహారావు కాలం నుంచి కొంత రైట్‌ ఆఫ్‌ ది సెంటర్‌గానూ సందర్భానికి తగినట్టు ఒదిగిపోగల సరళతను ఆ పార్టీ అలవరచుకున్నది. భారతీయ జనతా పార్టీ దాని స్వభావరీత్యా కచ్చితమైన రైటిస్టు పార్టీ. మితవాద, మతవాద పార్టీ. ఈ విధానాలతో విస్తృతస్థాయి మద్దతు కష్టం కనుక వాజపేయి ప్రధానిగా ఉన్నకాలం నుంచి కొంత ఉదారవాద ముసుగును ధరిస్తున్నది. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైట్‌ ఆఫ్‌ ది సెంటర్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని కీలక విషయాల్లో అది ఫక్తు రైటిస్టు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నది. ‘బ్యాక్‌ టూ ది బేసిక్స్‌’ను ఆశ్రయిస్తున్నది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత రాజ్యాంగం హామీ పడిన సెక్యులర్, ఫెడరల్‌ స్వభావాల విషయంలో బీజేపీకి భిన్నాభిప్రాయాలున్నాయి. లౌకికత్వం నుంచి హైందవీకరణ వైపు దాని అడుగులు పడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మితిమీరిన కేంద్రీకరణ వైపు దాని ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. లెఫ్ట్‌ ఆఫ్‌ ది సెంటర్‌గానో, రైట్‌ ఆఫ్‌ ది సెంటర్‌గానో, సెంట్రిస్టుగానో వ్యవహరించే ఒక గట్టి జాతీయ ప్రత్యామ్నాయం లేకపోతే బీజేపీ తన మౌలిక విధానాలవైపు పయనించే అవకాశం ఉన్నది. వేలాది రకాల ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆరాధనా పద్ధతులు, ఆహార విహారాలు సహజీవనం చేసే మన బహుళ జీవన వ్యవస్థలో ఆ పయనం కల్లోలానికి కారణమవుతుంది. కనక చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌ తప్పనిసరి. అందుకోసం కాంగ్రెస్‌ ఖాళీని పూరించడం ఒక చారిత్రక అనివార్యత.

ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ లాంటి వేదిక బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతుందా? అసాధ్యం. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రజలు ఒక బలమైన ప్రభుత్వాన్నే కోరుకుంటారు తప్ప కలగూరగంపను ఆదరించే ప్రసక్తే ఉండదు. పోనీ, కాంగ్రెస్‌ పార్టీని ముందుపెట్టి దాని వెనక ప్రాంతీయ, లౌకిక పార్టీలు నిలబడితే?... కాంగ్రెస్‌ నాయకత్వంపై రాయ్‌బరేలి, అమేఠీ ప్రజలకే నమ్మకం లేదు, ఇక దేశ ప్రజలెట్లా నమ్ముతారు? నెహ్రూ – గాంధీ కుటుంబాన్ని పక్కనపెట్టి మిగిలిన కాంగ్రెస్‌ను ముందుకు నడిపితే?... మిగిలిన కాంగ్రెస్‌ రాష్ట్రానికో ప్రాంతీయ పక్షంగా విడిపోయే అవకాశం ఉంటుంది. అందరినీ కలిపి ఉంచే ఉమ్మడి స్ఫూర్తి ఏమీ మిగలదు. మరి కిం కర్తవ్యం? నరేంద్ర మోదీ కత్తికి ఎదురుండదా? చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంటుందా?

చరిత్రకు కొన్ని అనివార్య పరిస్థితులను కల్పించే లక్షణమున్నది. అటువంటి పరిస్థితుల్లో అనూహ్యమైన ప్రత్యామ్నాయాలు, పార్టీలు ముందుకు రావచ్చు. మన కళ్ల ముందున్న జనతా పార్టీ అనుభవమే ఇందుకు గొప్ప ఉదాహరణ. దేశంలో ఎమర్జెన్సీ విధించే నాటికి జనతా పార్టీ లేదు. ప్రతిపక్ష నాయకులందర్నీ ఇందిరమ్మ ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఎల్‌కే అద్వానీ, భైరాన్‌సింగ్‌ షెఖావత్, అశోక్‌ మెహతా, చంద్రశేఖర్, మధు దండావతే, బిజూ పట్నాయక్, పీలూ మోదీ, రాజ్‌నారాయణ్, చరణ్‌సింగ్‌ వగైరా వివిధ పక్షాల నేతలంతా రోహటక్‌ జైల్లో ఉన్నారు. అదే విధంగా అన్ని జైళ్లలోనూ వివిధ పక్షాల నాయకులు ఏడాది పైగా సహజీవనం చేశారు. వీళ్లంతా మాట్లాడుకోకుండా ఉంటారా? కానీ, వేర్వేరు పార్టీల వాళ్లంతా ఒకే పార్టీగా మారుతారని ఊహించని ఇందిర ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ఎన్నికలను ప్రకటించారు. భారతీయ జనసంఘ్, సంస్థా కాంగ్రెస్‌ (పాత కాంగ్రెస్‌), భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ కలిసి జనతా పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్‌ నుంచి జగ్జీవన్‌రామ్, బహుగుణల నాయకత్వంలో చీలిపోయిన సీఎఫ్‌డీ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఒక ప్రభంజనంలా ఎన్నికల ఫలితాలొచ్చాయి. కేంద్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. ‘విజయేందిర’గా, ‘అపర దుర్గ’గా ప్రసిద్ధికెక్కిన మహా నాయకురాలు స్వయంగా రాయ్‌బరేలీలో ఓడిపోయారు. అధికారంలో ఉన్నవారు నిరంకుశ పాలన వైపు అడుగులు వేసినప్పుడు, రాజ్యాంగబద్ధ పాలన నుంచి పక్కకు తొలగినప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ రూపం తోసుకొస్తుందని చెప్పడానికి జనతా ప్రయోగం ఒక పాఠం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం. బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ!

జనతా ప్రయోగం విఫలం కాలేదా? మూడేళ్లలోనే ఆ పార్టీ విచ్ఛిన్నం కాలేదా? అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. నిజమే! కానీ అది తన తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చింది. నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. భవిష్యత్తులో ఒక బలీయమైన శక్తిగా ఎదగనున్న భారతీయ జనతా పార్టీకి పురుడు పోసింది. రాజకీయాల్లో యునైటెడ్‌ ఫ్రంట్, యునైటెడ్‌ పార్టీలను నడపడం ఒక ఆర్ట్‌! యుద్ధకళ! ప్రపంచ చరిత్రలో అనేకమంది విజేతలు ఈ ఐక్యపోరాటాల నుంచే ఉద్భవించారు. బీజేపీయే అందుకు ఒక ఉదాహరణ. జనసంఘ్‌ పేరుతో ఉన్నప్పుడు భారత రాజకీయాల్లో అదొక అంటరాని పార్టీ. దాని హిందూత్వ ఎజెండా కారణంగా ఇతర పార్టీల వారు జనసంఘ్‌తో వేదికను కూడా పంచుకునేవారు కాదు. 1967లో మొదటిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రామ్‌మనోహర్‌ లోహియా చొరవతో చాలా రాష్ట్రాల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌లు ఏర్పడ్డాయి. వాటిలో జనసంఘ్‌ కూడా చేరటానికి లోహియా కారకుడయ్యాడు. ఫలితంగా జనసంఘ్‌ విస్తృతి పెరిగింది. జనతా పార్టీ విచ్ఛిన్నమయ్యే నాటికి అందులో చేరిన మిగిలిన పార్టీలు బలహీనపడ్డాయి.

భారతీయ జనతా పార్టీ పేరుతో జనసంఘ్‌ కొత్త అవతారం ఎత్తింది. ఉమ్మడి పార్టీలోని ఇతర పార్టీల వారు, తటస్థుల చేరికతో బీజేపీ బలపడింది. పార్టీ నాయకత్వం అనుసరించిన సమయానుకూల ఎత్తుగడలు బీజేపీని బలంగా తీర్చిదిద్దాయి. స్వతంత్ర పార్టీ, సంస్థా కాంగ్రెస్, సోషలిస్టు పార్టీ, భారతీయ లోక్‌దళ్‌లు గల్లంతయ్యాయి. చైనాలో చాంగ్‌కైషేక్‌ నాయకత్వంలో కుమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వానికీ, మావో జెడాంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులకూ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆ దేశంపై జపాన్‌ దురాక్రమణ జరిగింది. 

జపాన్‌కు వ్యతిరేకంగా కుమింటాంగ్‌తో ఐక్య సంఘటనకు మావో సిద్ధపడ్డాడు. జపాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలోనే మావో ఎత్తుగడల ఫలితంగా అనతికాలంలోనే చైనా కమ్యూనిస్టుల హస్తగతమైంది. తైవాన్‌కు పారిపోయాడు చాంగ్‌కైషేక్‌. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ఖాళీని భర్తీ చేయడానికి వివిధ పార్టీలు యునైటెడ్‌ పార్టీగా లేదా ఫోరమ్‌గా ఆవిర్భవించే పరిస్థితులు ఏర్పడవని చెప్పలేము. కొన్ని ప్రాంతీయ, లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు ఇందులో తాత్కాలికంగా విలీనం కాబోవనీ చెప్పలేము. అజేయుడైన భీష్మాచార్యుని పడగొట్టడానికి కారణభూతుడైన శిఖండి జన్మ ఎత్తడం కోసం తనను తాను దహనం చేసుకున్న అంబ మాదిరిగా, పునర్జన్మ ఎత్తడం కోసం దహనమయ్యే ఫీనిక్స్‌ పక్షుల్లా రాజకీయ పక్షాలు సిద్ధపడే రోజులు వస్తాయేమో! ఆ ఐక్య వేదిక ద్వారా లబ్ధి పొంది ఒక బలమైన రాజకీయ శక్తి బీజేపీ మాదిరిగా ఆవిర్భవిస్తుందేమో! ఎదురు చూడాలి. ఇప్పటికైతే ‘రాజు మరణించాడు. రాజు చిరకాలం జీవించాలి’ అని ప్రకటిద్దాం.
 

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top