తస్మాత్‌ జాగ్రత్త!

Covid 19: Omicron Variant Effect Reduces But Need To Take Precautions - Sakshi

దాదాపు నెల్లాళ్లపాటు దేశాన్ని వణికించిన ఒమిక్రాన్‌ ముగిసినట్టేనని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అందరికీ ఊరటనిచ్చి ఉంటుంది. అమలు చేస్తున్న ఆంక్షల్ని సమీక్షించి, అవసరాన్ని బట్టి పాక్షికంగా తొలగించటమో, పూర్తిగా ఎత్తేయటమో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని కూడా కేంద్రం సూచించింది. రెండేళ్లనుంచి జనం కోవిడ్‌ పడగ నీడలో జీవితాలు గడుపుతున్నారు. ఏనాడూ ఊహకైనా అందని ఆంక్షలు చవిచూశారు.  2020 అక్టోబర్‌లో వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వైనం కనబడినప్పుడు ఏమైందో మరిచిపోకూడదు. ఒకపక్క వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పక్షాలు పెడచెవిన పెట్టాయి. ప్రజానీకం సైతం పండుగలు, ఉత్సవాల్లో మునిగిపోయారు.

వేరే దేశాల్లో అప్పటికే రెండో దశ విజృంభణ మొదలైనా అందరూ బేఖాతరు చేశారు. మన దేశంలో రెండో దశ ప్రవేశించి, ఎవరికీ తెలియకుండానే ముగిసిందని కొందరూ... అసలు రెండో దశకు ఆస్కారమే లేదని మరికొందరూ వాదించారు. ఇవన్నీ సాగుతుండగానే చాపకింద నీరులా వైరస్‌ వ్యాప్తి మొద లైంది. కేసుల సంఖ్య వందల నుంచి వేలకు వెళ్లింది. చివరకు నిరుడు మార్చిలో కోవిడ్‌ రెండో దశ ప్రారంభమైందని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. 19 రాష్ట్రాల్లో రెండో దశ తడాఖా చూపింది. అధికారిక గణాంకాలను బట్టి చూస్తే ఆ ఏడాది జూలై నాటికి 2.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి దశలో చనిపోయిన 1.57 లక్షలమందిని కలుపుకొంటే అప్పటికి దేశంలో 4 లక్షల 11 వేల 435 మంది కేవలం కరోనా మహమ్మారి కారణంగా మరణిం చారు. అయినప్పటికీ మొన్న డిసెంబర్‌లో ఒమిక్రాన్‌ తలెత్తేనాటికి యథాప్రకారం అలసత్వమే కన బడింది. అంతకు అయిదారు నెలలముందు వైరస్‌ స్వైర విహారం చేసిన తీరును అందరూ మరి చారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఊహకందనంత వేగంగా ఉన్నా అదృష్టవశాత్తూ ఆ నిష్పత్తిలో మరణాలు సంభవించలేదు. ఇది సహజంగానే మరింత నిర్లక్ష్యానికి దారితీసింది. మొత్తంగా ఒమిక్రాన్‌ కేసులు బుధవారం నాటికి 30,615 వరకూ ఉండగా 514 మంది చనిపోయారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే ఆంక్షల్ని తొలగిస్తున్నాయి. మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనను ఈ కోణంలో అర్థం చేసుకుంటే మరోసారి కష్టాల్లో పడకతప్పదు. ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు జరపడం, వైరస్‌ జాడల్ని గుర్తించి అవసరాన్ని బట్టి తగిన ఆంక్షలు అమల్లోకి తీసుకురావడం, వ్యాధిగ్రస్తులకు చికిత్స, అవసరమైనవారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కొనసాగించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దనీ, దాని పోకడలు ఎలా ఉంటాయో అంచనా వేయటం కష్టమనీ ఇప్పటికీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ రూపం తీసుకున్నాక అది బలహీనపడిందని అంటున్నవారు లేకపోలేదు.

కానీ మును ముందు ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరంగా పరిణమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే హెచ్చరించింది. వాస్తవానికి ఆంక్షలు సడలించవచ్చునని కేంద్రం ప్రకటించడానికి చాలాముందుగానే ప్రభుత్వాల్లో అలసత్వం ఏర్పడింది. ఇదంతా ఏ స్థాయిలో ఉందంటే సడలింపు గురించి కేంద్రం ప్రకటించాక అసలు ఆంక్షలు అమల్లో ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. మన దేశంలో దాదాపు 80 శాతంమందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంచనా వేసిన స్థాయిలో ఒమిక్రాన్‌ నష్టం కలగ జేయకపోవడానికి ఆ వైరస్‌ బలహీనపడటం ఒక కారణమైతే, జనాభాలో అధిక శాతంమంది రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడం మరో కారణం కావొచ్చు. గతంతో పోలిస్తే కరోనా వైరస్‌కు సంబంధించి మన పరిజ్ఞానం గణనీయంగా పెరిగింది. ఆ మహమ్మారి రూపు రేఖా విలాసాలను కనిపెట్టి దాన్ని నియంత్రించే పనిలో దేశదేశాల్లోని శాస్త్రవేత్తలూ నిమగ్నమై ఉన్నారు. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను ఛేదించేలా అది రూపాంతరం చెందడానికి దానిలోని ఏ జన్యువులు తోడ్పడుతున్నాయన్న అంశంలో చురుగ్గా పరిశోధనలు సాగుతున్నాయి. ఇవన్నీ అంతిమంగా కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి తోడ్పడితే మంచిదే.

కరోనా వైరస్‌ పేరిట మన దేశంలో లాక్‌డౌన్‌లు, ఇతరత్రా ఆంక్షలు ఎంత అసంబద్ధంగా అమలు చేశారో, దాని పర్యవసానంగా ఎన్ని కోట్లమంది జీవితాలు ఛిద్రమయ్యాయో కళ్ల ముందుంది. అయినా కొన్ని రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఒమిక్రాన్‌ పేరు చెప్పి బడులకు సెలవులు ప్రకటించడం, వేరే రాష్ట్రాలనుంచి రాకపోకలను అడ్డగించడం వంటి చర్యలు అమల య్యాయి. వైరస్‌ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా ఆంక్షలు సడలించాలన్న ఆలోచనే లేనట్టు ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఇప్పటికైనా అహేతుకమైన చర్యలు చాలించాలి. వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. అధిక జనాభా ఉన్న మనలాంటి దేశంలో మహమ్మారులు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించగలవో అర్థమైంది గనుక ప్రభుత్వాలు అలసత్వాన్ని విడనాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంతమంది సిబ్బందిని నియమించడం, అక్కడ మెరుగైన వైద్య ఉపకరణాలు అందుబాటులో ఉంచటం మొదలుకొని అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. ఖర్చు కోసం వెనకాడకుండా పకడ్బందీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top