● సత్యదేవుని యంత్రాలయం సెంట్రల్ ఏసీ పనుల తీరు
● ఆరు నెలలుగా ఇబ్బందులు
అన్నవరం: సత్యదేవుని యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ అమర్చే పనులు జరుగుతున్న తీరు నత్తను తలపిస్తున్నాయి. ప్రారంభించి ఆరు నెలలైనా ఈ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. సత్యదేవుని ఆలయం రెండంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు కొలువై ఉంటారు. దిగువ అంతస్తును యంత్రాలయంగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి శ్రీమత్రిపాద్విభూతి వైకుంఠ నారాయణ యంత్రం ప్రతిష్ఠించి ఉంటుంది. దీనికి నలువైపులా విష్ణు పంచాయతనంలోని నాలుగు దేవతలు గణపతి, సూర్య భగవానుడు, అంబిక, శంకరుడు కొలువై ఉంటారు. ఈ యంత్రానికి మూడు పూటలా పూజలు చేస్తారు. ప్రతి రోజూ వేలాదిగా భక్తులు యంత్రాలయాన్ని కూడా దర్శించుకుంటారు. పలువురు రూ.50 టికెట్టుతో యంత్రాలయం లోపలకు వెళ్లి యంత్రానికి ప్రదక్షిణ చేస్తూ పంచాయతన దేవతలను దర్శించుకుంటారు.
ఇదీ సమస్య
యంత్రాలయంలో మూడుచోట్ల స్ల్పిట్ ఏసీలున్నాయి. అయితే, అవి తరచూ పాడవుతూండటంతో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. రామాలయం పక్కనే పాత అకౌంట్స్ కార్యాలయంలో జ్యోతిర్మయి వ్రతం కోసం గతంలో బిగించిన సెంట్రల్ ఏసీని తీసుకువచ్చి యంత్రాలయంలో ఏర్పాటు చేశారు. గత కార్తిక మాసంలోనే అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు యంత్రాలయం గోడకు రంధ్రం చేసి లేదా కిటికీ రంధ్రం ద్వారా కానీ బ్లోయర్ పైపులు ఆలయం వెలుపలకు తీసుకు రావాల్సి ఉంది. ఇక్కడే వచ్చింది. ఆలయం గోడలకు రంధ్రం చేయడం లేదా దక్షిణం వైపు కిటికీని తొలగించి బ్లోయర్లు ఏర్పాటు చేయడం శాస్త్ర సమ్మతం కాదంటూ వేద పండితులు అభ్యంతరం చెప్పారు. అయితే, సత్యదేవుని గర్భాలయంలో ఇదే విధంగా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసినప్పుడు వెనుక కిటికీని తొలగించి బ్లోయర్ల గొట్టాలు వెలుపలకు తీసుకువెళ్లారు. యంత్రాలయంలో కూడా ఆవిధంగా చేస్తే సమస్య ఉండదు. కానీ, పండితుల అభ్యంతరాలు లేదా ఇతర కారణాలతో అధికారులు ఆవిధంగా చేయడం లేదు. దీంతో, ఆరు నెలలుగా సెంట్రల్ ఏసీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. అసలే వేసవి ఎండలు నానాటికీ తీవ్రమవుతూండటంతో యంత్రాలయం లోపలకు వెళ్లిన భక్తులు అక్కడి వేడికి ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేస్తున్నామనే పేరుతో గతంలో ఏర్పాటు చేసిన స్ల్పిట్ ఏసీలకు కూడా మరమ్మతులు చేయించడం లేదు. మున్ముందు ఎండలు మరింత ముదిరితే యంత్రాలయం లోపల నిమిషం కూడా ఉండే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధ్యమైనంత త్వరగా సెంట్రల్ ఏసీ పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
త్వరలోనే పూర్తి చేయిస్తాం
యంత్రాలయంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సెంట్రల్ ఏసీ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తాం. బ్లోయర్ పైపులు వెలుపలకు తేవడానికి కిటికీ తొలగించేందుకు ఉన్న అభ్యంతరాలపై వేద పండితులతో చర్చిస్తాం. అవసరమైతే దేవదాయ శాఖ స్థపతితో కూడా చర్చించి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


