చాగల్లు: విద్యుదాఘాతంతో చిక్కాలపాలెం గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చిక్కాలపాలెం గ్రామానికి చెందిన బొంతు వంశీ (25) కొబ్బరికాయల దింపు కార్మికుడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ రైతు కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి కాయలు దింపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న కొబ్బరి ఆకు నరికి కింద పడవేసే సమయంలో, కొబ్బరి ఆకుకు విద్యుత్ తీగ తగిలి, ఆకు గుండా వంశీకి విద్యుత్ ప్రవహించడంతో, షాక్ తగిలి చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. తోటి కూలీలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే వంశీ చనిపోయాడు. తల్లి బొంతు ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతి చెందిన వంశీ అవివాహితుడు.
ఫోర్జరీ కేసులో
ఇద్దరికి మూడేళ్ల జైలు
తుని రూరల్: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన ముగ్గురికి ఫోర్జరీ కేసులో తుని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.పదివేల చొప్పున జరిమానా విధించినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి గురువారం తెలిపారు. 2019లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంలో భాగంగా కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించిందన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో నష్టపరిహారం తీసుకున్న వీరిపై అప్పటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్యూటీ కలెక్టర్ కె.సుధారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎస్సై సుధాకర్ విచారణ చేశారన్నారు. ముద్దాయిలు అప్పన్న వీరలక్ష్మి, చిలకమర్తి సూర్యవతి, అప్పన్న రంగారావులపై నేరం రుజువైంది. విచారణ కాలంలో రంగారావు మృతి చెందగా వీరలక్ష్మి, సూర్యవతిలకు శిక్ష, జరిమానా విధించినట్టు వివరించారు.


