ఆలమూరు: మండలంలోని చొప్పెల్లలో అక్రమంగా తరలిస్తున్న 265 తాబేళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుని పంట కాలువలో సురక్షితంగా వదలిపెట్టారు. రావులపాలెం అటవీశాఖ సెక్షన్ అధికారి కె.రాంబాబు కథనం ప్రకారం కొందరు ద్వారపూడి, మండపేట, ఆలమూరు మీదుగా తాబేళ్లను ఒడిశాకు తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి డిప్యూటీ రేంజ్ అఽధికారి రాజా ఆధ్వర్యంలో డీఎస్‌ఎన్ మూర్తి బృందం ఆ వాహనాన్ని వెంబడించింది. చొప్పెల్ల లాకుల వద్ద ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాన్ని పక్క పార్క్ చేసి నిందితులు తూర్పు డెల్టా ప్రధాన కాలువలో దూకి తప్పించుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనంలో తాబేళ్లను స్వాధీనం చేసుకుని జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీవీ ప్రసాదరావుకు, ఆలమూరు వెటర్నరీ కార్యాలయానికి సమాచారం అందించారు. వెటర్నరీ ఏడీ ఎల్.అనిత వాటిని పరీక్షించి ఇండియా ప్లాప్ సెల్ రకం జాతి తాబేళ్లుగా వాటిని గుర్తించి రావులపాలెం అటవీశాఖ కార్యాయానికి తరలించారు. వారి సూచనల మేరకు మధ్య డెల్టా ప్రధాన కాలువలో వాటిని సురక్షితంగా వదిలేశారు.


