● పడిపోయిన కొబ్బరి ధరలు
● గతంలో వెయ్యి కాయలు రూ.32 వేలు
● నేడు రూ.14 వేలు
● రైతులు, వ్యాపారుల గగ్గోలు
● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి సాగు – 70 వేల హెక్టార్లు
● గత నెల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు – 400 నుంచి 500 లారీలు
● ప్రస్తుతం సాగుతున్న ఎగుమతులు – 150 లారీలు మాత్రమే
● గోదావరి జిల్లాల్లో కొబ్బరి ధరను నిర్ణయించే మార్కెట్లు – అంబాజీపేట, పాలకొల్లు
● గతంలో ఎకరానికి దిగుబడి 1,000 కాయలు ● ప్రస్తుతం 1,500 నుంచి 1,700
● ధర బాగున్నప్పుడు అమ్మకానికి సరకు కొరత ● నేడు సరకు ఉన్నా పలకని ధర
● మార్కెట్‌ను ముంచెత్తుతున్న కేరళ, కర్నాటక, తమిళనాడు కాయలు
● ఇతర రాష్ట్రాల సరకు రావడంతో భారీగా తగ్గిన ధరలు ● వేసవి కావడంతో బొండాలకు పెరిగిన డిమాండ్
● ముదురు కాయ ఒక్కటి రూ.8 పలికితే బొండాం రూ.15
పెరవలి: కొబ్బరి మార్కెట్‌లో సగానికి సగం ధరలు తగ్గటంతో రైతులు కుదేలయ్యారు. నెల రోజుల క్రితం వరకు కొబ్బరికి మంచి ధర పలికింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కాయలు మార్కెట్‌ను ముంచెత్తటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పండగల సీజన్ కూడా ముగియటం, వినాయక చవితి వచ్చేవరకు ఎటువంటి శుభ కార్యక్రమాలు లేకపోవటం వలన ధరలు తగ్గాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. మార్కెట్‌లో వేయి కాయలకు రూ.14 వేలు ధర పలుకుతున్నా, దింపు ఖర్చు, మోత, ఒలుపు, రవాణా చార్జీలంటూ రైతుల నుంచి వేయి కాయలను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు కాయ నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నారు. రైతులే స్వచ్ఛందంగా కాయలు తీసి గుట్టగా వేస్తే తోట దూరాన్ని బట్టి వేయి కాయలను రూ.12వేల నుంచి రూ.13 వేలకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళా దగ్గర నుంచి ప్రారంభమైన ధరల పెరుగుదల ఆ ఏడాది సెప్టెంబర్ నెలఖారుకు రూ.32 వేలకు చేరింది. అక్టోబర్ నుంచి తగ్గుతూ నెలాఖరు నాటికి రూ.21 వేల వద్ద స్థిరంగా ఉండి, నవంబర్ నెల ప్రారంభం నుంచి ధర పతనం అవుతూ నేడు రూ.14 వేల వద్ద ఉంది.
దిక్కుతోచని రైతులు, వ్యాపారస్తులు
కొబ్బరి ధరలు తగ్గటంతో రైతులు, వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొబ్బరి కాయలు తీయకపోవటంతో చెట్ల నుంచి రాలిపోతున్నాయని రైతులు, తీస్తే ఎక్కడ ధర మరింత తగ్గిపోతుందోనని వ్యాపారస్తులు భయపడి కొనుగోలు జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికే కొనుగోలు చేసిన కాయలను ఎలా వదలించుకోవాలా అని ఆలోచనలో వ్యాపారస్తులు ఉండగా, ఎంతో కొంత వస్తుందిలే అనుకుని తీత తీద్దామన్నా ఎవరూ రావటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.


